సోమవారం మధ్యాహ్నం కిరాత్‌పురలోని ధని బడియాలి గ్రామంలో బోర్‌వెల్‌లో పడిపోయిన 3 ఏళ్ల చిన్నారి చెత్నాను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా చిన్నారి చేతుల కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సహాయక బృందాలు తెలిపాయి.
సోమవారం రాత్రి బాలికను బయటకు తీసుకొచ్చేందుకు బోర్‌వెల్‌లో రింగ్ రాడ్‌ను అమర్చారు. అయితే ఆ రాడ్ బాలిక దుస్తులకు ఇరుక్కుపోడం వల్ల ఆ ప్రయత్నం విఫలమైంది. అయితే పాపలో ఇంకా కదలికలు ఉన్న రీత్యా, ఆమెను రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాయి.
సోమవారం మధ్యాహ్నం పాప బోర్‌వెల్‌లో పడిపోగా, సహాయక బృందాలు సాయంత్రానికల్లా అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. తరువాత చిన్నారి పరిస్థితి తెలుసుకునేందుకు బోర్‌వెల్‌లోకి ఆక్సిజన్, కెమెరాలను పంపించారు. పాప సుమారు 150 అడుగుల లోతులో తలకిందులుగా చిక్కుకుపోయిందని గుర్తించినట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు. ఆ అమ్మాయి ఏడుపు శబ్దం అడపాదడపా వినిపిస్తోందని అన్నారు.