Meerpet Madhavi Murder Case Update : హైదరాబాద్ మీర్‌పేట మహిళ హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. నిందితుడు గురుమూర్తి మొబైల్‌లో మరో మహిళ ఫోటోలను పోలీసులు గుర్తించారు. ఆమెతో ఉన్న అక్రమ సంబంధం వల్లే మాధవిని వదిలించుకునేందుకు హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. మటన్ కత్తితో మృతదేహాన్ని ముక్కలు చేసిన గురుమూర్తి బకెట్లో పెట్టి వాటర్ హీటర్‌తో ఉడికించినట్లు తెలుస్తోంది. అనంతరం అందులోనే దంచి చెరువులో పడేసినట్లు పోలీసులకు నిందితుడు వెల్లడించారు. తర్వాత మాధవి కనిపించట్లేదంటూ ఆమె తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలుస్తోంది.
భార్య కనిపించడం లేదని ఫిర్యాదు : ఆర్మీలో పనిచేసి రిటైరైన గురుమూర్తి జిల్లెలగూడలో నివాసముంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని ఫోన్లో ఉన్న మహిళ ఫోటోల గురించి మాధవి ప్రశ్నించింది. ఈ విషయంపై ఈనెల 15న భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో గురుమూర్తి దాడి చేసినట్లు పోలీసులు అంచనావేశారు. దాడిలో భార్య చనిపోవడంతో ముక్కలు చేసి మాయం చేసిన గురుమూర్తి, మాధవి కనిపించడం లేదని ఈనెల 17 ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. వారితో కలిసి మీర్‌పేటలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పట్టించిన సీసీ కెమెరాలు : నిందితుడి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు మాధవి బయటకు వెళ్లినట్లు కనిపించకపోవడంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో మరో మహిళతో ఉన్న ఫోటోలను పోలీసులు గుర్తించారు. మరో మహిళతో సంబంధం నేపథ్యంలో భార్యను కడతేర్చేందుకు పథకం పన్ని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఐతే నిందితుడు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించట్లేదని సమాచారం.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకటమాధవికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా జేపీచెరువుకు చెందిన గురుమూర్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం డీఆర్డీవోలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నాడు.
ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహం పారేసిన జిల్లెల చెరువులో ఆనవాళ్ల కోసం వెతుకున్నారు. కేవలం నిందితుడు చెప్పిన సమాచారంతో మాత్రమే కాకుండా సాంకేతిక ఆధారాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు.
మీర్‌పేటలో దారుణం - భార్యను కుక్కర్లో ఉడికించి, రోటిలో దంచి హతమార్చిన భర్త