Inspiring Story Of Behror Payal :మనిషి ధైర్యం చేస్తే దేవుడి అండ తప్పక లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ మాట రాజస్థాన్‌లోని ముందావర్ పట్టణానికి చెందిన 15 ఏళ్ల పాయల్‌కు కరెక్టుగా సరిపోతుంది. ఐదేళ్ల క్రితం ఒక ప్రమాదంలో ఆమె రెండు చేతులను కోల్పోయింది. చిన్న వయసులోనే ఇంత పెద్ద ప్రమాదాన్ని చూసినా పాయల్ కించిత్తు కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. ఇప్పుడామె తన పాదాల సాయంతో అన్ని పనులు చేస్తోంది. ఏదో ఒకరోజు ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని పాయల్ ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
పదేళ్ల క్రితం ఏం జరిగిందంటే?
పదేళ్ల క్రితం, పాయల్ ఐదేళ్ల వయసులో ఉండగా ఒక ప్రమాదం జరిగిందని ఆమె నానమ్మ గుర్తు చేసుకున్నారు. "అప్పుడు పొలంలో పాయల్ ఆడుకుంటోంది. ఒక విద్యుత్ తీగ తెగి పొలంలో పడిందనే విషయం పాయల్‌కు తెలియదు. ఆమె బంతితో పాటు కింద పడి ఉన్న విద్యుత్ తీగను పట్టుకుంది. దీంతో పాయల్‌కు కరెంటు షాక్ తగిలింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే జైపూర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి పాయల్ రెండు చేతులను తొలగించారు" అని పాయల్ నానమ్మ చెప్పుకొచ్చారు.
కాలితో రాస్తున్న పాయల్ (ETV Bharat) నోట్‌బుక్ తెమ్మన్న పాయల్- నానమ్మ ఎమోషనల్
ఆస్పత్రిలో పాయల్‌కు రెండు చేతులను తొలగించిన నెలన్నర తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన వెంటనే పాయల్ తన నానమ్మను నోట్‌బుక్, పెన్ను ఇవ్వమని అడిగింది. స్కూల్ హోంవర్క్ చేస్తానని ఆమె చెప్పింది. పాయల్ అమాయకంగా చెప్పిన ఆ మాటలు విని, నానమ్మ కళ్లు నీళ్లతో నిండిపోయాయి. పాయల్ బాగా పట్టుబట్టడంతో, తాత ఆమెకు ఒక కాపీ, పెన్ను తెచ్చి ఇచ్చాడు. వాటిపై పాయల్ తన పాదాలతో రాయడం ప్రారంభించింది. ఇలా రాయడంలో ఆమె కొన్నాళ్ల పాటు సమస్యలను ఎదుర్కొంది. కానీ ఆ తర్వాత పాయల్ వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడామె 10వ తరగతి చదువుతోంది.
కాలితో ఆహారం తింటున్న పాయల్ (ETV Bharat) రెండు చేతులు లేకున్నా సమస్య లేదు : పాయల్
'ఈటీవీ భారత్'తో పాయల్ మాట్లాడింది. "నాకు రెండు చేతులూ లేవు. అయినా ఎలాంటి సమస్యా లేదు. నా పనులన్నీ స్వయంగా చేసుకుంటున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి సమస్యా లేదు. నా కాళ్లతోనే అన్నం తింటున్నా. దుస్తులు కూడా నేనే ధరిస్తాను. సైకిల్ కూడా నడుపుతాను. ఇంట్లో ఉన్నవారితో పాటు, పాఠశాలలో అందరూ నాకు మద్దతు ఇస్తున్నారు" అని పాయల్ చెప్పుకొచ్చింది. ఐఏఎస్ కావాలి అనేది తన జీవిత లక్ష్యమని తెలిపింది.
పాయల్ కృషిని చూసి గర్విస్తున్నాం : ధరమ్‌వీర్, పాయల్ తండ్రి
పాయల్ తండ్రి ధరమ్‌వీర్ మాట్లాడుతూ, "నా కుమార్తె పాయల్‌కు 2015లో ప్రమాదం జరిగింది. ఆ ఘటనతో మా మొత్తం కుటుంబం షాక్‌లోకి వెళ్లింది. పాయల్ వీలైనంత త్వరగా కోలుకోవాలని మేం కోరుకున్నాం. అయితే మా చేతుల్లో ఏమీ లేదని మాకు తెలుసు. అలాంటి సమయంలో పాయల్ చాలా ధైర్యం చూపించింది. ఆమె వెనక్కి తగ్గలేదు. ఈ రోజు పాయల్ కృషిని చూసి మేం గర్విస్తున్నాం. ఐఏఎస్ కావాలనే ఆమె కల నెరవేరుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.