How to Make Mango Chicken Recipe : మనకు వేసవి కాలం వచ్చిందంటే చాలు వెంటనే మామిడికాయలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే సమ్మర్లో విరివిగా కాస్తాయి. ఈ క్రమంలో చాలా మందికి పచ్చి మామిడికాయలు చూడగానే రకరకాల వంటలు చేయాలనిపిస్తుంది. కానీ, దాంతో పప్పు, పచ్చడి, పులిహోర వంటివి తప్ప ఇంకేం చేయలేం అనిపిస్తుంది. అలాంటి వారికోసం అదిరిపోయే మామిడికాయ చికెన్ ఫ్రై రెసిపీ తీసుకొచ్చాం. పైగా వీకెండ్ కలిసివస్తోంది. దీనిని చేసుకోవడం కూడా చాలా ఈజీ. అంతేకాదు.. సమ్మర్లో మామిడికాయను(Mango) తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మరి, ఇంకెందుకు ఆలస్యం మామిడికాయ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- చికెన్ - అరకేజీ
- మామిడికాయ - ఒకటి
- వేయించిన జీడిపప్పు - గుప్పెడు
- నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి- మూడు
- కరివేపాకు - రెండు రెమ్మలు
- ఉల్లిపాయలు - రెండు
- కారం - రుచికి సరిపడా
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్‌స్పూన్లు
- పసుపు - ఒక టీస్పూన్
- ధనియాలపొడి - టీస్పూన్
- గరం మసాలా - టీస్పూన్
- ఉప్పు - సరిపడా
- కొద్దిగా - కొత్తిమీర తరుగు.
చికెన్ ఇలా చుట్టేసి ఇవ్వండి - పిల్లలు "మమ్మీ యమ్మీ" అంటూ లాగిస్తారు! - Restaurant Style Chicken Tikka Roll
తయారీ విధానం :
- ముందుగా మామిడికాయను చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత చికెన్‌ను శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
- ఆ తర్వాత బౌల్లోకి తీసుకున్న చికెన్‌కు పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, కారం యాడ్ చేసుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలి. చికెన్‌లోని నీళ్లు పూర్తిగా ఇగిరిపోయేంత వరకు మధ్యమధ్యలో గరిటెతో కదుపుతూ ఉండాలి. నీళ్లు ఇగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. అది కాస్త వేడి అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులోనే పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు(అంతకుముందే చికెన్ ముక్కల్లో ఉప్పు, కారం వేశారు కాబట్టి చూసుకోని వేసుకోండి) వేసి గ్లాసు నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం మామిడికాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. అవసరమైతే మామిడి కాయ ముక్కలు ఉడకడానికి కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవాలి.
- ఇప్పుడు కొత్తిమీర తరుగు, మగ్గబెట్టిన చికెన్ వేసి లో ఫ్లేమ్ మీద ముక్క ఉడికి నీరు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం ద్వారా మసాలా ముక్కలకు బాగా పడుతుంది.
- ఆ తర్వాత ఉప్పు సరిచూసుకుని వేయించిన జీడిపప్పు యాడ్ చేసుకోవాలి.
- చివరగా కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు పైన చల్లి మూతపెట్టి తిరిగి మరో ఐదు నిమిషాలపాటు మగ్గించుకోవాలి. అంతే పుల్లపుల్లగా కారం కారంగా టేస్టీగా ఉండే.. మామిడికాయ చికెన్ ఫ్రై రెడీ!
- దీనిని బగారా రైస్ లేదా పలావ్ ప్రిపేర్ చేసుకొని తినండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బాగా నచ్చుతుంది! ఇక మామిడికాయ చికెన్ ఫ్రైలా కాకుండా గ్రేవీలా కావాలనుకుంటే వాటర్ పూర్తిగా ఇంకిపోకుండా ఉంచుకుంటే చాలు!
చికెన్ రెగ్యులర్‌గా వండేస్తున్నారా? - ఈ సండే ఇలా చేయండి - కమ్మగా, కారంగా!