Egg Biryani Recipe in Cooker :చికెన్, మటన్ బిర్యానీ ఎన్నోసార్లు టేస్ట్ చేసి ఉంటారు. మరి.. ఎగ్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు అంటే మాత్రం ఇవాళ తప్పకుండా ప్రయత్నించండి. కుక్కర్లో కేవలం 10 నిమిషాల్లోనే ఘుమఘుమలాడే ఎగ్ బిర్యానీ మీ కళ్ల ముందుంటుంది. ముఖ్యంగా.. ఈ ఎగ్ బిర్యానీ బ్యాచిలర్స్ కు అద్వితీయంగా ఉంటుంది. మరి.. ఈ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దామా..
ఎగ్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు :
- గుడ్లు 5 (ఉడికించి పెట్టుకోవాలి)
- ఉల్లిపాయలు -2
- పెరుగు అర కప్పు
- పచ్చిమిర్చి-3
- జీడిపప్పులు- 10
- దాల్చిన చెక్క - చిన్నది
- గరం మసాలా -అర టేబుల్ స్పూన్
- బిర్యానీ మసాలా- అర టేబుల్‌స్పూన్
- పసుపు - చిటికెడు
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- కారం పొడి- 1tsp
- టమాటాలు-2
- బాస్మతి బియ్యం-గ్లాసు
- నెయ్యి - కొద్దిగా
- లవంగాలు - 4
- యాలకులు- 2
- మరాఠి మొగ్గ- 1
- అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 tsp
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర, పుదీనా తరుగు
ఎగ్ బిర్యానీ తయారీ విధానం :
- ముందుగా బాస్మతి బియ్యం తీసుకుని రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకోండి.
- తర్వాత స్టౌ పై పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి.
- తర్వాత వాటిని వాటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టండి. ఇప్పుడు అదే పాన్‌లో కొన్ని జీడిపప్పులు వేసి వేయించి పక్కన పెట్టుకోండి.
- అలాగే ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా వేసి ఉడికించుకున్న గుడ్లను ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి.
- తర్వాత అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠి మొగ్గ, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత టేబుల్‌స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోండి. అలాగే టమాటా ముక్కలను వేసుకుని ఫ్రై చేయండి.
- టమాటాలు ఉడికిన తర్వాత చిటికెడు పసుపు, టేబుల్‌స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి కలపండి.
- అలాగే పెరుగు వేసి సన్నని మంట మీద కలపండి.
- ఇప్పుడు ఈ మసాలా మిశ్రమంలో బాస్మతి బియ్యం వేయండి. గ్లాసు బియ్యానికి సమానంగా గ్లాసు నీళ్లు పోసి, మరో పావు గ్లాసు నీళ్లనూ యాడ్ చేయాలి. ఒకవేళ నార్మల్ రైస్ ఉపయోగిస్తే.. ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసుకోవాల్సి ఉంటుంది. వాటర్ సరిగ్గా పోసుకుంటేనే.. రైస్ పొడిపొడిగా ఉంటుంది.
- తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తమీర, పుదీనా వేసి మిక్స్ చేయండి.
- వేయించుకున్న గుడ్లను వేసి కొద్దిగా నెయ్యి యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టండి.
- ఒక విజిల్ వచ్చేంత వరకు చూసి స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే నోరూరించే యమ్మీ ఎగ్ బిర్యానీ రెడీ!
- ఈ ఎగ్ బిర్యానీని వేడిగా ఉన్నప్పుడు రైతాతో కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు రెసిపీని ట్రై చేయండి.