Tirumala Special Darshan Tickets for November 2024: తిరుమలలో కొలువై ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని చూసేందుకు భక్తులు నిత్యం బారులు తీరుతుంటారు. అయితే.. శ్రీవారి దర్శనభాగ్యం మాత్రమే కాకుండా.. ఆ వెంకన్నకు సేవ చేసుకునే భాగ్యాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కల్పిస్తోంది. ఇందులో భాగంగా 3 నెలల ముందుగానే ఆన్లైన్ ద్వారా.. ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ నెలకు సంబంధించిన స్పెషల్ దర్శన టికెట్లను విడుదల చేస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
స్పెషల్ దర్శనం టికెట్లు: నవంబర్ నెలకు సంబంధించిన.. శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లను ఈరోజు (ఆగస్టు 24) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అదే విధంగా.. తిరుపతి, తిరుమలలో గదుల కోటాను ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
27న శ్రీవారి సేవ కోటా..: శ్రీవారి సేవ కోటా టికెట్లను 27వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా.. నవనీత సేవ టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టోకెన్లు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తామని టీటీడీ అధికారులు చెప్పారు.
ఇప్పటికే ఆ టికెట్లు విడుదల: నవంబర్ నెలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగస్టు 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.
22న కల్యాణోత్సవం టికెట్లు: ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అదే విధంగా.. నవంబరు 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్పయాగం సేవ టికెట్లను కూడా విడుదల చేశారు. వర్చువల్ సేవల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు.
23న అంగప్రదక్షిణ టోకెన్లు..: నవంబరు కోటా అంగప్రదక్షిణ టోకెన్లను 23న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేశారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లను అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. అదే విధంగా.. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేశారు.
శ్రీవారి ఆర్జితసేవలు, స్పెషల్ దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ను సందర్శించాలని టీటీడీ అధికారులు కోరారు.
ఇవి కూడా చదవండి :
శ్రీవారిని దగ్గరగా దర్శించుకునే అవకాశమివ్వండి - భక్తుడి ప్రశ్నకు టీటీడీ ఈవో ఏం చెప్పారంటే ! -
శ్రీవారి భక్తులకు శుభవార్త - వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ప్రకటించిన టీటీడీ