Tamilnadu Hospital Fire Accident Today : తమిళనాడులోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దిండిగల్-తిరుచ్చి రోడ్డులో ఉన్న ఆస్పత్రిలో గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆస్పత్రిలో ఆకస్మికంగా మంటలు ఎగిసిపడ్డాయి. కొన్ని నిమిషాల్లో అవి ఆసుపత్రి అంతా వ్యాపించాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దట్టమైన పొగలు కమ్ముకోవడం వల్ల ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదాన్ని గుర్తించిన కొంతమంది లిఫ్టులో కిందికి వచ్చేందుకు ప్రయత్నించారు. లిఫ్టు కదలకపోవడం వల్ల అందులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు, మూడేళ్ల వయసున్న చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసు బలగాలు, ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు అక్కడికి పెద్దఎత్తున చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయి. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 50 అంబులెన్స్‌లతో సహాయక చర్యలు చేపట్టారు. రోగులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఇక ప్రమాదంలో గాయపడిన వారికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.