Ants Better Than Humans : ఒక బృందంగా కలిసి నిర్ణయాలు తీసుకోవడంలో, అందరితో కలిసి పనిచేయడంలో మనుషుల కంటే చీమలే చాలా బెటర్ అని తాజా పరిశోధనలో తేలింది. గ్రూప్ డెసిషన్స్ తీసుకోవడంలో ఇప్పటి వరకు మానవులే అపర మేధావులనే అపోహ ఉంది. కానీ ఈ విషయంలో మనుషుల కంటే చీమలే చాలా మెరుగని స్పష్టమైంది.
శ్రమశక్తికి ప్రతీకగా
శ్రమశక్తికి చీమలు ప్రబల ఉదాహరణలు! సంఘశక్తిని చాటుతూ క్లిష్టమైన పనులు నిర్వర్తించడంలో వాటికి ఎవరకూ సాటి లేరు. తాజా పరిశోధన ప్రకారం, 'ఒక చిక్కు మార్గం గుండా భారీ సరకులను చాలా యుక్తిగా, సులువుగా మోసుకెళ్లే విషయంలో చీమలు, మానవుల కన్నా ఎంతో సమర్థతతో పనిచేస్తాయి. ఇందుకోసం పక్కా వ్యూహాన్ని అనుసరిస్తాయి. సామూహికంగా అన్నీ ఒక లక్ష్యంతో పనిచేస్తాయి. వాటి జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఎలాంటి తప్పిందాలు జరగకుండా పక్కా ప్రణాళికతో పనిచేసి తమ లక్ష్యాన్ని పూర్తి చేస్తాయి.'
మనుషులకు అంత లేదు!
చీమలతో పోల్చితే, మనుషుల పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. అందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడి నిర్ణయాలు తీసుకునే విషయంలో చీమలు మెరుగ్గా పనిచేస్తే, మనుషులు మాత్రం ఈ విషయంలో వెనుకబడ్డారు. అంతేకాదు గ్రూప్ డెసిషన్ మేకింగ్ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంలోనూ మానవులు విఫలమయ్యారు. ఇజ్రాయెల్లోన వెయిజ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
"మనుషులు బృందాలుగా ఏర్పడినప్పటికీ వారి విషయ గ్రహణ సామర్థ్యమేమీ పెరగలేదు. సోషల్ నెట్‌వర్క్‌ల యుగంలో బాగా ప్రాచుర్యం పొందిన 'గ్రూప్ డెసిషన్ మేకింగ్' అనేది మనుష్యుల్లో అంత ప్రభావవంతంగా కనిపించలేదు. కానీ చీమలు మాత్రం బృంద నిర్ణయాలు తీసుకోవడంలో మనుషుల కంటే చాలా గొప్పగా పనిచేశాయి" అని పరిశోధనకు నేతృత్వం వహించిన ఓఫర్ ఫైనర్‌మన్ వివరించారు.
ఒంటరిగా పని చేసినప్పుడే
ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధనలో కొన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి. "మనుషులు ఒంటరిగా పనిచేసినప్పుడు వారి విషయ గ్రహణ సామర్థ్యం బాగుంది. అంతేకాదు వారు వ్యూహాత్మక ప్రణాళికలు వేసుకొని, సరైన నిర్ణయాలు తీసుకోగలిగారు. కానీ మనుషులందరూ కలిసి బృందాలుగా ఏర్పడినప్పడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనుషులు గ్రూప్‌గా ఏర్పడి, సమిష్టి నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యారు. కానీ చీమలు విడివిడిగా పనిచేసేటప్పటి కన్నా, బృందంగా ఏర్పడి మెరుగైన నిర్ణయాలు తీసుకుని తమ లక్ష్యాన్ని సాధించాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కొన్ని సందర్భాల్లో మనుషుల కన్నా చీమలే ఎక్కువ సత్తా చూపించాయి" అని పరిశోధకులు చెబుతున్నారు.