Groundwater Levels are Falling in Hyderabad : హైదరాబాద్ మహా నగరంలో భూగర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయి. ఒక నెలలోనే నగరంలో అర మీటరు నుంచి మీటరు దాకా జల మట్టాలు పడిపోవడం రానున్న వేసవికి ప్రమాద సూచికగా నిపుణులు అంటున్నారు. గతేడాది నగరంలో కంటే కొంచెం మెరుగ్గా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు, ప్రధానంగా ఓఆర్ఆర్ లోపల మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం భూగర్భ జలాలు తగ్గాయి. వేసవి నాటికి నీటి సమస్య మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు.
ట్యాంకర్ల డిమాండ్ తారా స్థాయికి : ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో తక్కువ లోతులో ఉన్న బోర్లరో నీరు రావడం లేదు. ఫలితంగా పది రోజుల నుంచి హైదరాబాద్లో జలమండలి నీటి ట్యాంకులకు డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న ట్యాంకర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు మార్చి వరకు సరిపోతాయని, డిమాండ్ పెరిగితే అందుకు అనుగుణంగా ట్యాంకర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు పెంచుకునే దానిపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం 600 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా, అదనంగా మరో 200 ట్యాంకర్లను పెట్టుకుంటోంది. మే, జూన్ నెలల్లో వాటర్ ట్యాంకర్ల డిమాండ్ తారాస్థాయికి చేరుతుందని జలమండలి అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది మార్చిలో 1.69 లక్షలు, ఏప్రిల్లో 2.45 లక్షలు, మేలో 2.28 లక్షలు, జూన్లో 1.8 లక్షలు, జులైలో 1.47 లక్షల నీటిని ట్యాంకర్లతో సరఫరా చేశారు.
నామమాత్రంగానే అమలు : జల మండలి పరిధిలో 300 చదరపు మీటర్లు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అన్ని నివాస, నివాసేతర ప్రదేశాల్లో విధిగా ఇంకుడుగుంత ఉండాలనే నిబంధన ఉన్నా, అమలు మాత్రం నామమాత్రంగానే ఉంటుంది. జలమండలి 25,578 ప్రాంగణాల్లో తనిఖీ చేయగా, కేవలం 12,446 చోట్ల మాత్రమే ఇంకుడు గుంతలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇంకుడుగుంతలు లేని ఆవాసాలకు వాటర్ ట్యాంకర్ ఛార్జీలను వచ్చే సంవత్సరం నుంచి రెట్టింపు చేయాలని ఇప్పటికే జలమండలి నిర్ణయించింది.
- రంగారెడ్డి జిల్లా పరిధిలో భూగర్భ జలాలు స్వల్పంగా పెరుగుదల ఉన్నా, అది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉందని అధికారులు అంటున్నారు.
- డిసెంబర్ చివరి నాటికి భూగర్భ జల వనరుల శాఖ తాజా విశ్లేషణ ప్రకారం హైదరాబాద్లో నవంబర్ కంటే డిసెంబర్లో 0.47 మీటర్ల భూగర్భ జలమట్టాలు తగ్గగా, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో 1.08 మీటర్లు అడుగంటాయి.
- హైదరాబాద్ భూగర్భ జల మట్టాలు 6.96 మీటర్లు, మేడ్చల్-మల్కాజ్గిరిలో 10.35 మీటర్లు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 9.08 మీట్లర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో భూగర్భ జల మట్టాలు గతేడాది కంటే పడిపోయినట్లు వివరిస్తున్నారు.
- హైదరాబాద్లో సాధారణం కంటే 18 శాతం అధిక వర్షపాతం నమోదైనా, ఆ మేరకు భూగర్భ జలాలు పెరగడం లేదు.