తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎలక్టోరల్‌ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధం'- సుప్రీంకోర్టు సంచలన తీర్పు - Electoral Bond supreme verdict

Electoral Bonds On Supreme Court : ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ ఏకగ్రీవ తీర్పును ప్రకటించింది.

Electoral Bonds On Supreme Court
Electoral Bonds On Supreme Court

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 11:05 AM IST

Updated : Feb 15, 2024, 12:20 PM IST

Electoral Bonds On Supreme Court :రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం సమాచార హక్కును హరిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగీవ్ర తీర్పునిచ్చింది.

ఈ ఎన్నికల బాండ్లపై విచారణ జరిపిన రాజ్యంగ ధర్మాసనం రెండు వేర్వేరు తీర్పులు ఉన్నాయని తెలిపింది. అందులో ఒకటి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, మరొకటి జస్టిస్ సంజీవ్ ఖన్నాది. అయితే రెండు తీర్పులు ఏకగ్రీవంగా ఉన్నాయని తెలిపింది. ఇక ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది. నల్లధనాన్ని అరికట్టాలనే కారణంతో సమాచార చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

క్విడ్​ప్రోకోకు దారి తీసే అవకాశం
రాజకీయ పార్టీలకు విరాళాలివ్వడం క్విడ్ ప్రోకోకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. అలానే 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మార్చి 13 లోగా ఆ ఎన్నికల బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఈసీని ఆదేశించింది.

ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్​ స్పందించారు.' ఈ ఎలక్టోరల్ బాండ్లు పౌరుల ప్రాథమిక హక్కును ఉల్లంఘించాయి. అందుకే సుప్రీం కోర్టు ఈ పథకాన్ని, అలానే అమలులోకి తీసుకురావడానికి చేసిన అన్ని నిబంధనలను కొట్టివేసింది' అని ప్రశాంత్ భూషణ్ తెలిపారు.

ఈ ఎన్నికల బాండ్ల చెల్లబాటుపై పిటిషన్ దాఖలు చేసి జయా ఠాకూర్ స్పందించారు. "రాజకీయ పార్టీలకు ఏ వ్యక్తి ఎంత డబ్బులను ఇస్తున్నారో వెల్లడించాలి. కానీ, 2018లో తీసుకొచ్చిన ఈ పథకం పార్టీలకు నగదును ఇచ్చే వారి పేర్లను రహస్యంగా ఉంచుతుంది. ఇది సమాచార హక్కు చట్టానికి విరుద్ధం. అందుకే నేను సుప్రీం కోర్టులో ఒక పిటిషన్​ దాఖలు చేశాను" అని తెలిపారు.

రాజకీయ పార్టీలకు ఇచ్చే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2018 జనవరి 2న ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకాన్ని సవాల్​ చేస్తూ ఏడీఆర్‌, కాంగ్రెస్‌ నాయకురాలు జయా ఠాకుర్‌, సీపీఎం, మరో పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు విచారణను చేపట్టింది. గతేడాది నవంబర్​లో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా గురువారం తీర్పును వెల్లడించింది.

అసలేంటీ ఎన్నికల బాండ్లు
ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్‌ లాంటివి. ఇవి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)లో మాత్రమే లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బేజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.

Last Updated : Feb 15, 2024, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details