Congress Promises For Women :మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళలపై హామీల జల్లు కురిపించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలోని పేద కుటుంబంలోని ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద రూ.లక్ష ఇస్తామని ప్రకటించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో 'నారీ న్యాయ్' పేరిట మహిళలకు ఐదు గ్యారెంటీలను ప్రకటించింది హస్తం పార్టీ.
'హామీలను నెరవేరుస్తాం'
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'నారీ న్యాయ్' పేరిట దేశంలోని మహిళల కోసం కొత్త అజెండాను తీసుకురాబోతున్నామని ఖర్గే పోస్ట్‌లో తెలిపారు. 'మా హామీలు- ప్రకటనలు మాత్రమే కావు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. 1926 నుంచి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఈ పోరాటంలో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు అందించండి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి' అని ఖర్గే కోరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు.
మహిళల కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలివే
- మహాలక్ష్మి: ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా రూ.లక్ష నగదు నేరుగా వారి ఖాతాలోకి బదిలీ
- ఆదీ ఆబాదీ- పూరా హక్:కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా చేపట్టే నియామకాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్
- శక్తి కా సమ్మాన్: ఆశా, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకంలో విధులు నిర్వర్తించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం ఇచ్చే వాటా రెట్టింపు
- అధికార్ మైత్రీ :న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులను చేసి, వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతి పంచాయతీలో ఒక అధికార్ మైత్రీ నియామకం
- సావిత్రీబాయి పూలే హాస్టళ్లు: ఉద్యోగం చేసే మహిళల కోసం హాస్టళ్లు రెట్టింపు- ప్రతి జిల్లాలో కనీసం ఓ హాస్టల్ ఏర్పాటు