Civil Society Delegation Letter To EC :దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ శాతం గణాంకాలను మరింత పారదర్శకంగా వెల్లడించాలని పౌర సంఘం సభ్యుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. 4,000 మందికి పైగా సంతకాలతో కూడిన లేఖను సమర్పించింది. మొదటి రెండు దశల ఎన్నికలకు సంబంధించి వెల్లడించిన గణాంకాల్లో హెచ్చుతగ్గులను లేఖలో ముఖ్యంగా హైలైట్ చేసింది.
ప్రాథమిక అంచనాలు, తర్వాత సవరణ లెక్కల్లో వ్యత్యాసాలు ఉన్నాయని పౌర సంఘం సభ్యుల బృందం లేఖలో తెలిపింది. ఇది ఎన్నికల ప్రక్రియ కచ్చితత్వం, పారదర్శకతకు సంబంధించి ప్రజల్లో సందేహాలు, ఆందోళనలను రేకెత్తించిందని పేర్కొంది. ఎన్నికల నియమావళి రూల్ 49Sని ప్రస్తావించింది. దాని ప్రకారం, ప్రతి పోలింగ్ స్టేషన్‌లోని ప్రిసైడింగ్ అధికారి ఫారం 17Cలోని పార్ట్ Iలో నమోదైన ఓట్ల జాబితాను సిద్ధం చేసి, పోలింగ్ ఏజెంట్లకు కాపీలను అందించాల్సి ఉంది.
ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో!
అయితే ఇప్పటి వరకు పూర్తిన దశలకు సంబంధించి ఓటింగ్ జరిగిన అన్ని పోలింగ్ స్టేషన్‌ల ఫారం 17సీలోని పార్ట్ I కాపీలను అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా పారదర్శకతను పెంపొందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. దేశంలో జరిగే తదుపరి దశ ఎన్నికలు ముగిసిన 48 గంటల్లోగా నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల సంఖ్యను బహిరంగంగా వెల్లడించాలని కోరింది.