Cabinet Decisions Today : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, దేశంలో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కీలక నిర్ణయం తీసుకుంది. 28,602 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశవ్యాప్తంగా పది నగరాల్లో 12 నూతన పారిశ్రామిక నగరాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. పది రాష్ట్రాల్లో ఆరు మెగా కారిడార్లను వ్యూహాత్మక ప్రణాళిక కింద అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. దేశ ఆర్థికాభివృద్ధిని, తయారీ రంగ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలనుకుంటున్న భారత్ తపనను ఈ నిర్ణయాలు చాటుతున్నాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నగరాలు, తెలంగాణలోని జహీరాబాద్‌లో ఒక పారిశ్రామిక హబ్‌ను అభివృద్ధి చేస్తామని అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం-NICDPలో భాగంగా ఈ 12 ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 12 పారిశ్రామిక నగరాలను గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ నగరాలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి వివరించారు. ఈ నగరాల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 12 పారిశ్రామిక నగరాలు లక్షా 52వేల కోట్లు మేర పెట్టుబడులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.
కొప్పర్తి హబ్‌తో 54వేల మందికి ఉపాధి!
కొప్పర్తి పారిశ్రామిక హబ్‌లో 2,137 కోట్లతో 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తామన్న మంత్రి, 54 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఓర్వకల్లులో 2,786 కోట్లతో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ వస్తుందని, 45 వేలమందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. జహీరాబాద్‌లో 2,361 కోట్లతో 3,245 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ అభివృద్ధి చేస్తామన్న మంత్రి, లక్షా 74 వేల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ఈ పారిశ్రామిక నగరాల్లో ఆధునిక మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు.
"ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీ కార్యకలాపాలు భారత్‌కు తరలివస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, మొబైల్, రక్షణరంగ ఉత్పత్తుల తయారీ వంటివన్నీ భారత్‌కు తరలివస్తున్నాయి. ఈ కారిడార్లు, పారిశ్రామిక ప్రాంత ప్రాజెక్టులు ఆ తరలింపును వేగవంతం చేస్తాయి. ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే, ప్రారంభించడానికి తయారుగా ఉండడం, వచ్చి పని చేసుకునేలా ఉండడం, అలాగే మంచి నూతన నియమాలు, సత్వర అనుమతులు, భూసేకరణ ఇప్పటికే పూర్తయ్యాయి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ, గ్యాస్, విద్యుత్, టెలికాం వంటి వసతులు అన్నీ సమకూర్చుతున్నాం. వాతావరణంపై ప్రభావం తక్కువ ఉండేలా డిజైన్ చేశాం. మంచి దార్శనికతతో దేశంలో అతిపెద్ద తయారీ రంగ అభివృద్ధి, ఉద్యోగావకాల కల్పన ఇక్కడ జరుగుతుంది" అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దేశాభివృద్ధికి ఈసారి మూడింతలు కష్టపడతామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు కేంద్ర మంత్రి వివరించారు.