BJP Likely To Get New President :వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి కమలదళానికి నూతన జాతీయ అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. జనవరి మధ్య నాటికి సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే నూతన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ చేపడతామని వివరించారు.
ఫిబ్రవరి చివరి నాటికి కొత్త అధ్యక్షుడు
రాష్ట్రాల్లో దాదాపు 60 శాతం మంది బీజేపీ అధ్యక్షుల పదవీకాలం ముగిసిందని, వచ్చే నెల మధ్య నాటికి వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకునే అవకాశముందని ఓ సీనియర్ నాయకుడు చెప్పారు. 2024 ఫిబ్రవరి చివరి నాటికి బీజేపీ నూతన అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నామని తెలిపారు. కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎవరనేది ఇంకా ఖరారుకాలేదని పేర్కొన్నారు.
ఆ తర్వాతే బీజేపీ చీఫ్ ఎంపిక
జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని బీజేపీ రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఈ క్రమంలో సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు అధిష్ఠానం కృషి చేస్తోంది.
నాలుగేళ్ల కిందట బాధ్యతలు స్వీకరించిన నడ్డా
కేంద్ర మంత్రి జేపీ నడ్డా 2020 ఫిబ్రవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడి పదవీకాలం మూడేళ్లే అయినప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన పదవీకాలం పొడిగించారు.
జేపీ నడ్డా కన్నా ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన నేతృత్వంలో బీజేపీ దేశం నలుమూలలా విస్తరించింది. పలు రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించిన జేపీ నడ్డా కూడా పార్టీని విజయపథంలో నడిపించడంలో సఫలం అయ్యారు.