Lok Sabha Election 2024 Votes :చరిత్రలో ఎన్నడూ లేనన్ని అత్యధిక ఓట్లను 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే సొంతం చేసుకున్నాయి అధికార పార్టీ బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. అయినా కూడా ఆ రెండు పార్టీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు దక్కలేదని తాజా నివేదికలు వెల్లడించాయి. బీజేపీ ఇదివరకు ఎన్నడూలేని విధంగా 23.59 కోట్ల ఓట్లు సాధించిందని, అయితే సొంతంగా అధికారం చేపట్టగలిగే మెజారిటీ మార్కు 272ను మాత్రం ఈ సారి చేరుకోలేకపోయిందని అందులో పేర్కొంది.
కాంగ్రెస్ 13.67 కోట్ల ఓట్లను దక్కించుకున్నప్పటికీ, ఆ పార్టీ ప్రతిపక్ష హోదాకే పరిమితమైంది. 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల ద్వారా కాంగ్రెస్ మరో తరంలోకి అడుగుపెట్టగా, ఇక అదే ఎన్నికల్లో కాలు మోపి బీజేపీ కొత్త తరం రాజకీయాలకు నాంది పలికింది. కానీ ఈ నాలుగు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ 11.54 కోట్ల ఓట్ల నుంచి 13.67 కోట్ల ఓట్లకు చేరగా, (18.42% వృద్ధి), బీజేపీ 1.82 కోట్ల నుంచి 23.59 కోట్లకు (1,196% వృద్ధి) ఎగబాకిందని నివేదికలు వెల్లడించాయి.
అయితే బీజేపీ 1996 (స్వల్పకాలం), 1998, 1999, 2014, 2019, 2024లలో, కాంగ్రెస్ 1984, 1991, 2004, 2009లలో అధికారాన్ని చేపట్టాయి. 1989, 1996లలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ పేరుతో బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలు స్వల్పకాలం వరకూ మాత్రమే అధికారాన్ని చెలాయించగలిగాయి. తాజాగా ఈ వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేయడం గమనార్హం.