Bangalore Water Crisis 2024 :కర్ణాటక రాజధాని బెంగళూరులో మంచి నీటి సంక్షోభం తీవ్రంగా మారింది. ఈ క్రమంలో కార్ వాషింగ్, గార్డెనింగ్, నిర్మాణ పనులు, వాటర్ ఫౌంటెన్లు, రోడ్డు నిర్మాణం వంటి పనుల కోసం తాగునీటి వినియోగంపై నిషేధం విధించింది బెంగళూరు నీటి సరఫరా బోర్డు(BWSSB). తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5000 జరిమానాను విధిస్తామని తెలిపింది.
తాగునీటి సమస్యల కోసం హెల్ప్‌లైన్
తాగునీటి సమస్యల కోసం బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిన కొద్దిసేపటికే వందల కొద్ది ఫోన్లు వచ్చాయి. ప్రధాన లేఅవుట్‌ల నుంచి చాలా మంది నీటి సమస్య గురించి విన్నవిస్తున్నారు. ట్యాంకర్‌తో నీటి సరఫరాకు అధిక రుసుము వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ట్యాంకర్లతో వచ్చే నీటికి డిమాండ్ విపరీతంగా ఉందని అంటున్నారు. అలాగే 2008లో బీబీఎంపీలో చేరిన బెంగళూరు పరిసర 110 గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నాయి. అక్కడ కూడా ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు అధికారులు.
'బెంగళూరు నీటి సరఫరా బోర్డు(BWSSB) మార్చి 6న హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ఈ నంబర్‌కు ఫోన్ చేసి నీటి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. హెల్ప్‌లైన్ ప్రారంభించిన కొన్ని గంటలకే చాలా కాల్స్ వచ్చాయి. అపార్ట్‌మెంట్స్ నుంచి కూడా నీటి కొరతపై ఫిర్యాదులు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడం వల్ల ప్రైవేట్ ట్యాంకర్లు నీటిని సరఫరా చేయడం లేదు. అందుకే వాటర్‌బోర్డు ద్వారా నీటి సరఫరా చేయాలనే డిమాండ్ ఉంది. తీవ్రమైన నీటి కొరత, మురికివాడలు ఉన్న ప్రాంతాలపై బీబీఎంపీ దృష్టి సారించింది.' అని అధికారులు తెలిపారు.