Cyber Fraud In Telangana : రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుల అవసరాలు, సగటు కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, సాధారణ మహిళల భయాలను ఆసరాగా చేసుకొని దొరికినంత దోచుకుంటున్నారు. దీనిపై పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేసినా లాభం ఉండట్లేదు. సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ వేదికలను ఆసరాగా చేసుకొని అమాయకులను ఏమారుస్తున్నారు.
అంతర్జాలంలో నకిలీ వెబ్‌సైట్లు : తాజాగా అంతర్జాలంలో నకిలీ వెబ్‌సైట్లు, కష్టమర్ ఫోన్ నంబర్లను అసలైన సంస్థలకు దీటుగా సృష్టిస్తున్నారు. కష్టమర్లు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసిన వెంటనే దానికి సంబంధించిన వాటి నుంచి కాల్ చేసి మోసం చేస్తున్నారు. ఇలాంటివి రోజుకు చాలా కేసులు నమోదవుతున్నాయి.
రూ.5 వేలిస్తే నకిలీ వెబ్‌సైట్లు : ఎక్కువ మంది నకిలీ వెబ్‌సైట్, అసలు వెబ్‌సైట్ అనే తేడా గుర్తించలేకపోవడం ఒక సమస్య. రూ.5 వేలిస్తే బ్యాంకులు, ప్రముఖ సంస్థలను పోలిన నకిలీ వెబ్‌సైట్లను అచ్చుగుద్దినట్లు సృష్టిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2023- 24 వార్షిక నివేదికలో గూగూల్ సర్వీసుల్ని నేరగాళ్లు వాడుకుంటున్నట్లు ప్రస్తావించింది.
పెట్రోల్ బంకు ఫ్రాంచైజీ కోసం : బండ్లగూడకు చెందిన ఓ వ్యాపారి హెచ్‌పీ పెట్రోల్ బంకు ఫ్రాంచైజీ కోసం ఆన్‌లైన్‌లో అదే పేరున్న ఓ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు నమోదు చేశారు. వెంటనే రిలేషన్‌షిప్ మేనేజర్ పేరుతో కాల్ వచ్చింది. ఫీజుల పేరుతో రూ.1.65 లక్షలు వసూలు చేశారు. పదేపదే డబ్బులు అడగడంతో మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బస్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవడానికి : ఓ విశ్రాంత ఉద్యోగి బస్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో వెతికాడు. కస్టమర్ కేర్ నంబరు కనిపించగానే ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తులు ఓ లింకు పంపించారు. లింకు క్లిక్ చేసిన తర్వాత ఫోన్‌లో ఓ యాప్ డౌన్‌లోడ్ అయ్యింది.తర్వాత ఖాతాలోని రూ.35 వేలు బదిలీ చేసుకున్నట్లు సందేశం వచ్చింది. దీంతో అతడు మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.
ఒక్క అక్షరం మార్చి - రూ.10 కోట్లు కాజేశారు
మనం ఏం మారలేదు - కొత్త ఏడాది 6 రోజుల్లోనే 120 సైబర్ కేసులు, అందులో 30 న్యూడ్ కాల్స్!