Huge Crocodile in Wanaparthy District : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో భారీ మొసళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. తరచూ మొసళ్లు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత నెలలో దాదాపు 11 ఫీట్ల పొడవు 230 కిలోల బరువున్న భారీ మొసలి కనిపించింది. ఆ ఘటన మరువక ముందే మరో ముసలి కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే,
జిల్లాలోని పెబ్బేరు మండలం కంచిరావుపల్లి సమీపంలో నరసింహ అనే రైతు వరికి నీళ్లు పెట్టడానికి పొలానికి వెళ్లారు. ఈ సమయంలో వరి పొలంలో భారీ మొసలి కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన నరసింహ, గ్రామంలోని యువకులకు సమాచారం అందించారు. ఆ భారీ మొసలిని చూసిన గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. యువకుడు శివ ప్రసాద్ జిల్లా కేంద్రంలోని సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణ సాగర్‌కు సమాచారం అందించారు. కృష్ణ సాగర్ తన బృందంతో వచ్చి తాళ్లతో భారీ మొసలిని చాకచక్యంగా పట్టుకుని బంధించారు. అనంతరం మొసలిని బీచ్పల్లి వద్ద కృష్ణా నదిలో వదిలిపెట్టారు. దీంతో గ్రామస్థులు ఊరిపి పీల్చుకున్నారు. కృష్ణసాగర్ మాట్లాడుతూ వన్య ప్రాణులను రక్షించడం తమ బాధ్యత అన్నారు. బంధించిన మొసలిని బీచ్ పల్లి వద్ద కృష్ణా నదిలో వదిలిపెట్టినట్లు ఆయన తెలిపారు.
11 ఫీట్ల పొడవు 230 కిలోల బరువున్న భారీ మొసలి : వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో గత నెల 22న భారీ మొసలి కలకలం సృష్టించింది. ఓ ఇంటి ముందున్న సీతాఫలం చెట్టు వద్ద శబ్ధం రావడంతో కవిత అనే మహిళ వెళ్లి చూసింది. చెట్టు పొదల్లో భారీ మొసలి కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేస్తూ పరుగెత్తింది. దీంతో గ్రామస్థులు అక్కడకు వెళ్లి చూడగా భారీ మొసలి కదులుతూ కనిపించింది. వెంటనే అక్కడి స్థానికులు స్నేక్ సొసైటీ నిర్వాహకులు అయిన కృష్ణ సాగర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అటవీ శాఖ అధికారులతో కలిసి దాదాపు 11 ఫీట్ల పొడవు 230 కిలోల బరువున్న భారీ మొసలిని తాళ్లతో బంధించారు. అనంతరం గ్రామానికి దగ్గరగా ఉన్న కృష్ణా నదిలో మొసలిని విడిచిపెట్టారు.
ఇటువంటి సందర్భంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ సెక్షన్ అధికారిణి రాణి సూచించారు. చెరువుల్లో, కుంటల్లో, కాలువల్లో నీటి ప్రవాహం తగ్గడం వల్ల సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి, ఇళ్లల్లోకి మొసళ్లు వచ్చే అవకాశం ఉందని, ప్రజలందరూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
దేవుడి దర్శనం కోసం వెళ్లిన భక్తులకు షాక్ - ఎదురుగా ఆ రూపాన్ని చూసి!
పెరటి చెట్టు పొదల్లో కదలిక - ఏంటా అని వెళ్లి చూసిన మహిళ గుండె ఆగినంత పనైంది!