Ayodhya Ram Mandir History: అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో మరికొన్ని గంటల్లో శ్రీరాముడు కొలువుదీరనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ అమృత ఘడియల కోసం దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసింది. అయితే ఇదేమీ అంత ఈజీగా సాధ్యం కాలేదు. దీని వెనుక శతాబ్దాల చరిత్రే ఉంది. ఎన్నో పోరాటాలు జరిగాయి. మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయి. అయితే వాటన్నింటిని అధిగమించి రాములోరికి శాశ్వత నివాసాన్ని నిర్మించాలన్న ప్రయత్నం ఎట్టకేలకు నెరవేరనుంది. కోట్లాది హిందువుల కల సాకారమమవుతున్నవేళ, 1528 నుంచి ఇప్పటి జరిగిన కీలక పరిణామాల గురించి ఓ సారి చూద్దాం.
అసలేంటీ అయోధ్య వివాదం?
అయోధ్య వివాదం 1528లో మొదలైంది. ఆ సమయంలో భారతదేశాన్ని మొఘలుల పరిపాలించేవారు. అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్‌గా ఉన్న మీర్ బఖి అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించారు. రామాయణం ప్రకారం రాముడి జన్మస్థలం అయోధ్య రాముడిది అని అంటారు. కమాండర్ ఎక్కడైతే బాబ్రీ మసీదును నిర్మించారో సరిగ్గా అదే చోటే బాలరాముడు జన్మించారని చెబుతారు. అందుకే మసీదు కట్టగానే ఘర్షణలు మొదలయ్యాయి. ఆ తర్వాత 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు జరిగాయి. 1853, 1859లో ఈ గొడవలు తార స్థాయికి చేరాయి. దీంతో అప్పుటి బ్రిటీష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న ఆ ప్రాంతం చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది. మసీదు లోపలి భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది.
స్వాతంత్య్ర వచ్చాక ముదిరిన వివాదం
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1949లో ఈ వివాదం మరింత ముదిరింది. బాబ్రీ మసీదులో కొంతమంది హిందువులు బాలరాముడి విగ్రహం ఉందని చెప్పడం మొదలుపెట్టారు. దీంతో మతపరమైన ఘర్షణలు జరుగుతాయేమోనని అప్పటి ప్రభుత్వం దీనిని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది. దీంతో తలుపులకు తాళాలు పడ్డాయి. 1984లో ఈ స్థలానికి విముక్తి కల్పించి రామమందిరం నిర్మించాలంటూ విశ్వహిందూ పరిషత్ ఉద్యమాన్ని ప్రారంభించింది.
బాబ్రీ మసీద్ కూల్చివేత
1986 ఫిబ్రవరి 1న తాళాలను తీసివేయాలని ఫైజాబాద్ జిల్లా జడ్జి ఆదేశించారు. హిందువులు లోపలకు వెళ్లి పూజలు చేసుకోవచ్చని చెప్పారు. అప్పడే బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం ఏర్పాటైంది. 1990లో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దుతుగా సోమనాథ్ నుంచి బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణీ రథయాత్రను చేపట్టారు. 1992లో డిసెంబర్ 6న కొంతమంది కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చేశారు. ఇది దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. దీంతో చాలా చోట్ల మత ఘర్షణలు జరిగాయి. అయోధ్యతో పాటు పలు ప్రాంతాల్లో వేలాది మంది చనిపోయారు.