One Nation One Election Poll Code : ఎన్నికల కోడ్‌పై అభ్యంతరం తెలుపుతూ జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లులో చేసిన పలు ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తిరస్కరించింది. ఎన్నికల కోడ్ అమలైతేనే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని పేర్కొంది. ఎన్నికల నియమావళి వల్ల ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ పాలనాపరమైన స్తబ్దత ఏర్పడుతుందని రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదించడాన్ని తప్పుపట్టింది. ఈమేరకు తమ స్పందనను 2023 మార్చిలోనే లా కమిషన్‌కు ఈసీ సమర్పించింది.
ఈ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని జమిలి ఎన్నికల కమిటీకి కూడా ఎన్నికల సంఘం అప్పట్లో ఒక నివేదికను అందించింది. పదేపదే ఎన్నికలు జరిగితే పదేపదే ఎన్నికల కోడ్ అమలవుతుంది. అలాంటి సమయాల్లో ప్రభుత్వ విధానాల అమలు తాత్కాలికంగా నిలిచిపోతుంటుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఏం చేయొచ్చు అనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని లా కమిషన్ సేకరించినట్లు తెలిసింది.
లా కమిషన్‌కు ఈసీ ఫీడ్‌బ్యాక్
- అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాతే ఎన్నికల కోడ్‌ను అమల్లోకి తెస్తాం. ఆయా పార్టీల సమన్వయంతోనే దాన్ని అమలు చేస్తాం.
- ఎన్నికల కోడ్ అమలుతో రాజకీయ పార్టీలు, ప్రజలకు ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం పెరుగుతుంది.
- సాధ్యమైనంత తక్కువ కాలం పాటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండేలా ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకుంటుంది.
- ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తేదీకి, పోలింగ్ తేదీలకు పెద్దగా గ్యాప్ ఉండకుండా ఈసీ పక్కా ప్రణాళిక రచిస్తుంది.
ఎన్నికల కోడ్ గురించి బిల్లులో ఏముంది?
జమిలి ఎన్నికల విధానంతో ముడిపడిన రెండు రాజ్యాంగ సవరణ బిల్లులపై ప్రస్తుతం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమగ్ర అధ్యయనం చేస్తోంది. ఈ తరుణంలో ఎన్నికల కోడ్ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గతంలో స్పందించిన వివరాలు తెరపైకి రావడం గమనార్హం. జమిలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులో ఎన్నికల కోడ్ గురించి ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు.
"ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్‌ను అమలు చేస్తే అభివృద్ధి కార్యక్రమాలు, రోజువారీ జరగాల్సిన ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుంది. ఎన్నికల కోడ్ అమలు వల్ల ఇతరత్రా విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందికి ఎన్నికల విధుల కేటాయింపునకు సంబంధించిన నిర్ణయాలు క్లిష్టతరంగా మారుతాయి. అవసరమైన సందర్భాల్లో ఎన్నికల సిబ్బంది విధులను నిర్వర్తించాల్సి వ్యవధిని పొడిగించడం సాధ్యపడదు" అని ఒక జమిలి ఎన్నికల బిల్లులో పొందుపరిచారు.