తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలరాముడి పీఠం కింద మహా యంత్రం- తయారు చేసింది చీరాల ఆయనే!- విగ్రహం ఎలా ప్రతిష్ఠిస్తారు? - ayodhya ram mandir inauguration

Ayodhya Pran Pratishtha Rituals : రాముడు అంటే సకల లోకాలకే దేవుడు. ప్రపంచానికి ఆదర్శ పురుషుడు. మర్యాదా పురుషోత్తముడు. అలాంటి దేవదేవుడు జన్మస్థలిలో కొలువు తీరడం అంటే క్రతువులు మామూలుగా ఉంటాయా. అంతా శాస్త్రబద్ధంగా జరగాల్సిందే. పుణ్య క్రతువులు అన్నీ లెక్క ప్రకారం చేయాల్సిందే. మరి ఆ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఎలా నిర్వహిస్తారు? ఏయే పూజలతో ఆ జగదభిరాముడిని కొలువుతీరుస్తారు. ఎలాంటి పద్ధతులను అనుసరించి రామయ్యను పుట్టిన చోటకు చేరుస్తారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆయనకు జరిపే పూజా విధానాలేంటి. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ayodhya pran pratishtha rituals
ayodhya pran pratishtha rituals

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 8:16 AM IST

Ayodhya Pran Pratishtha Rituals :వేయి కళ్లతో ఎదురుచూస్తున్న మహోజ్వల ఘట్టం అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభం కావడం. ఆ ప్రారంభ వేడుకకు సర్వం సిద్ధమైంది. రాముడు జన్మస్థలంలో కొలువుతీరే పుణ్య కాలానికి సమయం ఆసన్నమైంది. అయితే లోకానికే దేవుడు అయిన రాముడు అలా కొలువు తీరడానికి అనేక పద్ధతులు ఉంటాయి. ఆ క్రమం పరిశీలిస్తే గర్భాలయంలో విగ్రహం నెలకొల్పే మూలపీఠం దిగువన యంత్ర ప్రతిష్ఠాపన చేస్తారు. అది అక్కడ నెలకొల్పడానికి మంత్రపూర్వకంగా సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని చీరాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అన్నదానం చిదంబరశాస్త్రి అయోధ్యలో రాములవారికి మందిర నిర్మాణం తప్పక జరిగి తీరుతుందనే సత్ సంకల్పంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన శ్రీరామ మహాయంత్రాన్ని తయారుచేసి, దానికి శ్రీ రామనామ మహామంత్రాన్ని సంపుటీకరణ చేశారు. 6 కోట్ల నామ జపాన్ని ఆ యంత్రానికి మంత్రపూర్వకంగా ధారపోశారు. గతేడాది అక్టోబర్‌లో ప్రత్యేకపూజలు, ఇతర ఆధ్యాత్మిక ప్రక్రియల నిర్వహణ కోసం ఆ యంత్రాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఇప్పుడు ఆ యంత్రమే రామ్ లల్లా కొలువయ్యే పీఠంకింద పవిత్ర ప్రదేశంలో నిక్షిప్తం కానుంది.

శ్రీరామనవమి రోజున విగ్రహాలపై సూర్యకిరణాలు
అయోధ్య రాముడి గర్భాలయంలో స్థిర చరమూర్తులు అష్టభుజి ఆకృతిలో ప్రతిష్ఠితం కానున్నారు. 8 అడుగుల ఎత్తైన బంగారు వేదికపై సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. భక్తులందరికీ దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపించేలా విగ్రహాన్ని మలిచారు. ఈ విగ్రహాలు కర్ణాటక, రాజస్థాన్‌లో రూపుదిద్దుకున్నాయి. 2 విగ్రహాలలో, ఒక సముదాయాన్ని జనవరి మొదటివారంలో ప్రతిష్ఠ కోసం ఎంపిక చేశారు. మిగిలిన మరోరకం విగ్రహ సముదాయాన్ని రెండో అంతస్తులోని మందిరంలో ప్రతిష్ఠాపన చేస్తారు. ఇక చరమూర్తిగా రామ్‌లల్లా విరాజ్ మాన్ విగ్రహం పూజలందుకుంటుంది. అయోధ్య ఆలయ సంప్రదాయం ప్రకారం చరమూర్తి రామ్‌లల్లానే ప్రధాన విగ్రహంగా భావిస్తారు. ఈ మూర్తికి విశేష పూజాదికాల్ని సమర్పిస్తారు. ఏటా శ్రీరామనవమి రోజున గర్భాలయంలోని సీతారాముల విగ్రహాలపై సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయ నిర్మాణం జరగడం మరో ప్రత్యేకత.

తొలిపూజ చేసేది ఆయనే
అయోధ్య రాముడికి రామ్ నాధీ సంప్రదాయంలో నిత్యపూజలు, ఉత్సవాలు జరగనున్నాయి. వైఖానసం, శ్రీవైష్ణవ సంప్రదాయంలో పాంచరాత్రం ఉన్న విధంగానే ఉత్తరాది వైష్ణవులు రామ్ నాధీ ఆగమరీతి పాటిస్తారు. అయోధ్య రామాలయంలో నిత్య పూజాదికాల్ని నిర్వహించడానికి 3వేల మంది అర్చకుల్ని ప్రాథమికంగా ఎంపిక చేశారు. వారికి వివిధ రకాలైన సంప్రదాయ పరీక్షలు నిర్వహించి వారిలో 20 మందిని పూజల కోసం ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్​లోని సీతాపూర్​కు చెందిన మోహిత్ పాండే అనే అర్చకుడికి రాంలల్లాకు తొలిపూజలు చేసే అవకాశం దక్కింది. ఆయన ఆధ్వర్యంలోనే ప్రాణప్రతిష్ఠ క్రతువు జరగనుంది. ఘజియాబాద్​లోని దూదేశ్వర్ వేద విద్యాలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలలో మోహిత్ పాండే వేదవిద్యను అభ్యసించారు.

123దేశాల్లోని 115నదీజలాలు సేకరణ
సనాతన ధర్మంలో గర్భాలయ ప్రాణప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. విగ్రహాన్ని ప్రతిష్ఠించే క్రమంలో ఆ విగ్రహానికి దైవశక్తిని ఆపాదించడమే ప్రాణప్రతిష్ఠ. దీనిని జీవశక్తి సంభావన క్రతువు అంటారు. సమస్త జీవకోటిని అనుగ్రహించే దివ్యమైన దేవతాశక్తి, ఆ విగ్రహంలోకి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా ఆహ్వానిస్తారు. ప్రాణప్రతిష్ఠ తర్వాతే ఏ దేవతామూర్తి అయినా ఆరాధనీయం అవుతుంది. అనంతంగా వ్యాపించి ఉన్న భగవత్ చైతన్యం, ఏకోన్ముఖంగా విగ్రహాకృతిలోకి ప్రతిష్ఠాపన మంత్రాల ద్వారా సమ్మిళితం చేస్తారు. 123 దేశాలలోని 115 నదుల నుంచి సేకరించిన జలాలను 2వేల 587 ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్ర మట్టిని ఈ ప్రాణప్రతిష్ఠలో వినియోగిస్తారు. వసుధైక కుటుంబం అనే భావన అభివ్యక్తం చేయడానికి, శ్రీరాముడు ఆకాంక్షించిన విశ్వ శ్రేయోభావనకు అనుగుణంగా ఈ వినూత్న ప్రక్రియను చేపట్టారు.

40 కిలోల వెండితో పైకప్పు
అయోధ్యలో ప్రతిష్ఠించే బాలరాముని విగ్రహాన్ని ముగ్గురు శిల్పులు వేర్వేరుగా రూపొందించారు. వీరిలో కర్ణాటకలోని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్‌ రూపొందించిన శిల్పం ప్రాణ ప్రతిష్ఠకు ఎంపికైంది. ఐదేళ్ల వయసున్న బాలరాముడి ముగ్దమోహనమూర్తి నిలుచున్న రీతిలో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేనిరీతిలో 5 గోపురాలతో, 3అంతస్తుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమైంది. గర్భగుడి వద్ద 40 కిలోల వెండితో పైకప్పు ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా, అయోధ్య రామాలయం చరిత్ర పుటలకెక్కింది. తీవ్రమైన భూకంపాలను సైతం తట్టుకునే రీతిలో అల్ట్రాసోనిక్ సాంకేతిక పరిజ్ఞానానికి, సంప్రదాయ ఆలయ నిర్మాణకళను మేళవించి ఈ ఆలయాన్ని రూపొందించారు.

ప్రాణప్రతిష్ఠ తర్వాత పూజలివే
అయోధ్య రాముడి గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠ సోమవారం మేషలగ్నంలో మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. ఈ సమయంలో మొదటి 84 సెకండ్లు కీలకమైనవిగా భావిస్తున్నారు. ఇక గర్భాలయంలో ప్రతిష్ఠించాల్సిన రాతి విగ్రహమూర్తులకు సరయూ నది జలాలతో ప్రత్యేక అభిషేకాల్ని నిర్వహిస్తారు. తర్వాత 40 రోజుల పాటు మూల విగ్రహాలకు, రామ్ లల్లాకు ఉడిపి పెజావర్ పీఠం పీఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ ఆధ్వర్యంలో మండలాభిషేక ఉత్సవాలు జరుగుతాయి.

51 అంగుళాల విగ్రహం, 392 స్తంభాలు, లక్షల అడుగుల పాలరాయి- అంకెల్లో 'అయోధ్య అద్భుతాలు' ఇవిగో!

అయోధ్య రాముడికి కలశ పూజ- గర్భగుడిలో హారతి

ABOUT THE AUTHOR

...view details