Modi Blames AAP :దిల్లీలో ఈసారి బీజేపీదే అధికారమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫిబ్రవరి 8న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలు 2,500 అందుకుంటారని చెప్పారు. ఆర్కేపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఆప్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. దిల్లీలో ఏ ఒక్క గుడిసెను తొలగించబోమని, అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యం రంగంలోనూ 'ఆపద' ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, ప్రజలను దోచుకున్నవారు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని ప్రధాని హెచ్చరించారు.
"స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా, ముఖ్యంగా నెహ్రూ హయాంలో రూ.12లక్షల ఆదాయం ఉంటే నాల్గో వంతు వేతనాన్ని ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో వెనక్కి తీసుకునేది. ఇందిర హయాంలో అయితే రూ.12లక్షల ఆదాయంపై దాదాపు రూ.10లక్షలు ట్యాక్స్ రూపంలో పోయేవి. అప్పుడు ఇలాగే ఉండేది. అందుకే నేను అవగాహన కల్పిస్తున్నాను. 10, 12 ఏళ్లకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రూ.12 లక్షలు సంపాదిస్తే రూ.2.60లక్షలు ట్యాక్స్ రూపంలో ఇవ్వాల్సి వచ్చేది. బీజేపీ తాజా బడ్జెట్ తర్వాత ఏడాదికి రూ.12 లక్షలు సంపాదించేవారు ఒక్క రూపాయి పన్ను కూడా కట్టాల్సిన అవసరం లేదు."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
'వసంత పంచమి తర్వాత వాతావరణంలో మార్పు ప్రారంభమవుతుంది. 3 రోజుల తర్వాత ఫిబ్రవరి 5న దిల్లీలో అభివృద్ధికి సంబంధించిన కొత్త వసంతం రానుంది. ఈ సారి దిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. దిల్లీలో ఓటింగ్‌కు ముందే చీపురు పుల్లలు ఎలా ఊడుతున్నాయో చూస్తున్నాం. ఆప్ నాయకులు ఆ పార్టీని వదిలివెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆప్‌పై ప్రజలు ఎంత నిరాశతో ఉన్నారో, ఎంత వ్యతిరేకత ఉందో వారికి తెలుసు' అని మోదీ అన్నారు.
ఈసారి కూడా మాదే విజయం: కేజ్రీవాల్
'దిల్లీ ఎన్నికల్లో ఆప్ చారిత్రాత్మక విజయందిశగా సాగుతుండగా, బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది' అని ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్ అన్నారు. ఓటమి భయంతో కమలం పార్టీ దిల్లీలో గూండాయిజం చేస్తోందని ఆరోపించారు. ప్రజలపై దాడులు చేస్తున్న బీజేపీ శ్రేణులపై చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు వెళ్లాయని కేజ్రీవాల్ విమర్శించారు. దిల్లీలో ఈ విధమైన ఎన్నికలను ప్రజలు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదన్నారు. బీజేపీ గూండాయిజానికి వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని దిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ గూండాయిజాన్ని దేశం దృష్టికి తెచ్చేందుకు ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ లేదా అధికార యంత్రాంగం దాడులు చేసినా వేధింపులు గురిచేసినా ఈ హ్యాష్‌ట్యాగ్ ద్వారా సమాచారం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు.