Who Is Parvesh Verma : మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ నేత పర్వేశ్ సింగ్ పేరు ప్రస్తుతం దిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన పర్వేశ్ రాజకీయ, కుటుంబ నేపథ్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రాజకీయాలకు కొత్తేం కాదు
27 ఏళ్ల తర్వాత దిల్లీలో జయభేరి మోగించిన కమలదళం, ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి పదవి రేసులో పర్వేశ్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. న్యూదిల్లీ నియోజకవర్గంలో 30వేల 88 ఓట్లు సాధించిన పర్వేశ్ వర్మ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై 4వేల 89 ఓట్ల తేడాతో గెలుపొందారు. వర్మ కుటుంబం రాజకీయాలకు కొత్తదేం కాదు.
భారీ మెజారిటీలు సాధించే నేతగా!
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేశ్ వర్మ. అదే న్యూదిల్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు. దీక్షిత్‌కు ఓటమి తప్పలేదు. పర్వేశ్ వర్మ దిల్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారు. 2013లో ఆయన తొలిసారి మహరోలీ శాసనసభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ దిల్లీ లోక్‌సభ స్థానంలో 2 లక్షల 68 ఓట్ల తేడాతో సత్తాచాటారు. ఇక 2019లో మళ్లీ పశ్చిమ దిల్లీ నుంచి పోటీ చేసి ఏకంగా 5 లక్షల 78 వేల ఓట్ల భారీ మెజారిటీతో జయకేతనం ఎగరవేశారు. భారీ మెజారిటీలు సాధించే నేతగా బీజేపీలో పర్వేశ్ వర్మకు మంచి పేరుంది.
పర్వేశ్ వర్మ పూర్తి పేరు పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ. ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ 1996 నుంచి 1998 మధ్య దిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించారు. దిల్లీ మాజీ సీఎం మదన్‌లాల్ ఖురానా తర్వాత సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో ఎంపీగా గెలుపొందారు. వాజపేయీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో వచ్చిన పర్వేశ్ ఇప్పుడు సీఎం పదవి రేసులో ముందు నిలిచారు. బీజేపీ అధిష్ఠానం ఆయన పేరును కూడా సీఎం పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అయితే సీఎం విషయంపై పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ మాట్లాడారు. "మార్పును కోరుకుంటూ బీజీపైపై విశ్వాసం ఉంచి గెలిపించిన దిల్లీ ప్రజలకు నా ధన్యవాదాలు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వంతో కలిసి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది" అని ఓ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు పర్వేశ్ సమాధానమిచ్చారు.