Telangana Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం రోజుకో విషయాన్ని వెల్లడిస్తోంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల్లో పరిశీలించిన వాటిని అధికారులు మూడు జాబితాలుగా విభజించారు. వాటిని ఎల్-1, ఎల్-2, ఎల్-3గా విభజన చేశారు. వీటిలో సొంత స్థలం ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయనుందని అధికారులు చెబుతున్నారు.
ఇది జాబితా :
- ఎల్-1 జాబితా - సొంత ఇంటి స్థలాలు ఉండి, ఇళ్లు లేని వారు
ఈ జాబితాలో సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లు ఉన్నవారిని కూడా చేర్చారు.
- ఎల్-2 జాబితా - సొంత స్థలం లేని వారు
వీరంతా స్థలంతో పాటు ఎలాంటి ఇళ్లు లేనివారు.
- ఎల్ -3 జాబితా - సొంత ఇళ్లు ఉండీ, ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారు
ఇలా విభజించారు : ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను కుటుంబ సర్వే, యాప్ సర్వే ఆధారంగా విభజించారు. ఈ విభజన ప్రకారం ఎల్-1లో 21.93 లక్షల దరఖాస్తులు, ఎల్-2లో 19.96 లక్షలు, ఎల్-3లో 33.87 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్‌ఎంసీలో ఇంకా 2.43 లక్షల ఇళ్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే మొదటి విడతలో 562 గ్రామాల నుంచి 71,482 మందిని ఇందిరమ్మ లబ్ధిదారులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ లబ్ధిదారుల్లో ఎల్-1 నుంచి 59,807 మంది, ఎల్-2 నుంచి 1,945 మంది, ఎల్-3 నుంచి 5,732 మంది, కొత్త దరఖాస్తుల నుంచి 3,998 మందిని ఎంపిక చేశారు.
కానీ మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో సొంత స్థలం ఉన్నవారికే ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. ఇందులో భాగంగా ఎల్-1 నుంచి అత్యధికంగా 59,807 మందిని ఎంపిక చేయగా, ఎల్-2, ఎల్-3 జాబితాలు, కొత్తగా వచ్చిన దరఖాస్తుదారుల కలిపి మొత్తం 11,675 మందిని ఎంపిక చేశారు. తర్వాత విడతల్లో ఎల్-1, ఎల్-2లోని మిగిలిన వారికే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. ఎల్-3లో 33.87 లక్షల మంది లబ్ధిదారుల్లో మెజార్టీ శాతం ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఇందిరమ్మ ఇళ్లు - ఈ కొలతల్లో కడితే రూ.5 లక్షలకు రూపాయి దాటదు!