Massive Theft In Businessman House : హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కలకలం రేపింది. సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.25 లక్షల నగదు చోరీకి గురైనట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో నిందితుడు సుశీల్‌ను నాగ్‌పుర్ సమీపంలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.
పోలీసుల కథనం ప్రకారం : హిమాయత్ నగర్‌లో నివాసం ఉండే వ్యాపారి రోహిత్ కేడియా ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా ఫిబ్రవరి 10న దుబాయ్‌కి వెళ్లారు. ఈ క్రమంలోనే దొంగలు ఇంట్లో పడి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. తన యజమాని ఇంట్లో దొంగలు పడ్డారని బుధవారం సాయంత్రం కేడియా మేనేజర్ అభయ్ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేడియా మేనేజర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్‌టీంను రప్పించి ఘటనా స్థలాన్ని క్షణ్నంగా పరిశీలించారు. బీరువాలో దాచి ఉన్న రూ.2 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.25 లక్షల నగదు చోరీకి గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో వేలిముద్రలను కూడా సేకరించారు. ఇది తెలిసిన వారు చేసిన పనే అని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సుశీల్ అనే వ్యక్తిని నాగ్‌పూర్‌లో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.