Microsoft Launches New Campus In Gachibowli : హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
యువతకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయి : క్యాంపస్ ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌తో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉందని అన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)దే అని తెలిపారు. మైక్రోసాఫ్ట్ కృషిలో 500 పాఠశాలల్లో ఏఐని వినియోగిస్తూ బోధన కొనసాగుతోందని, మైక్రోసాఫ్ట్ విస్తరణ ద్వారా తెలంగాణలో యువతకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.
మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు సీఎం ధన్యవాదాలు : హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయని, మైక్రోసాఫ్ట్ పెట్టుబడి స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తుందని, ఏఐ మౌలిక సదుపాయాలను మైక్రోసాఫ్ట్ కేంద్రం అభివృద్ధి చేస్తుందని అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్‌కు మైక్రోసాఫ్ట్ నిబద్ధత తోడ్పడుతుందని తెలిపారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ డిజిటల్ లైఫ్‌లో మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర : మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ అనేది విశ్వనగరమని, పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్ అని పేర్కొన్నారు. తెలంగాణ డిజిటల్ లైఫ్‌లో మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్‌గా మారడంలో మైక్రోసాఫ్ట్‌ది కీలక పాత్ర అని, హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు.
"హైదరాబాద్‌తో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉంది. మైక్రోసాఫ్ట్ విస్తరణ ద్వారా తెలంగాణలో యువతకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. తమ ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఏఐ మౌలిక సదుపాయాలను మైక్రోసాఫ్ట్ కేంద్రం అభివృద్ధి చేస్తుంది."- రేవంత్ రెడ్డి, సీఎం
సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ - తెలంగాణ అభివృద్ధిపై కీలక చర్చ
భారత్‌లో మైక్రోసాఫ్ట్ రూ.25,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్- క్లౌడ్, ఏఐ విస్తరణే టార్గెట్