తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గర్భసంచి తొలగించుకుంటున్న గ్రామీణ మహిళలు - ఎందుకంటే? - HYSTERECTOMY NEWS

దేశంలో ప్రతి 100 మంది మహిళల్లో ఐదుగురికి హిస్టరెక్టమీ - నిరక్షరాస్యులు, గ్రామీణులే అత్యధికం!

hysterectomy
hysterectomy (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2025, 6:41 AM IST

Hysterectomy News : దేశంలోని ప్రతి 100 మంది మహిళల్లో దాదాపు 5% మంది గర్భసంచి తొలగింపు (హిస్టరెక్టమీ) శస్త్రచికిత్సలు చేయించుకున్నారని ఓ నివేదిక వెల్లడించింది. 2015-16 మధ్య జాతీయ కుటుంబ సర్వేలో 4.5 లక్షల మంది గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి దీనిని రూపొందించారు. ముంబయిలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్, జాతీయ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ నివేదిక వివరాలు తాజాగా జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎవిడెన్స్‌లో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం, మన దేశంలో 25-49 ఏళ్ల మధ్య వయస్సున్న ప్రతి 100 మంది మహిళల్లో ఐదుగురు గర్భసంచిని తొలగించుకున్నారు. వీరిలో వ్యవసాయ పనుల్లో పాల్గొంటున్నవారి సంఖ్య అత్యధికంగా 32 శాతంగా ఉంది. ఈ రంగంలో ఉన్న ఉపాధి అభద్రతే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. నెలసరి సమస్యలు, దాని చుట్టూ ఉన్న అపనమ్మకాలు, అరోగ్యంపై అశ్రద్ధ మొదలైనవి గర్భసంచి తొలగింపునకు దారి తీస్తున్నాయి. దీనితోపాటు నెలసరి నొప్పులను భరించలేక, క్యాన్సర్‌ వస్తుందేమో అన్న భయాలతో కొందరు హిస్టరెక్టమీ చేయించుకుంటున్నారు. మరికొందరు పిల్లలను కనేసిన తర్వాత గర్భసంచిని నిరుపయోగ అవయవంగా భావించి, దానిని తొలగించుకుంటున్నారుని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువగా!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్‌ రాష్ట్రాల్లో హిస్టరెక్టమీ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోందని నివేదిక పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో అవసరం లేకపోయినా గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్సలు చేస్తున్నారా? అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని తెలిపింది. బిహార్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో హిస్టరెక్టమీ రేటు పెరగడానికి కుటుంబ ఆదాయం తక్కువగా ఉండటం కారణమైతే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆరోగ్య బీమా పరిధి ఎక్కువగా ఉండటం ఒక కారణంగా తెలుస్తోంది. అటు గ్రామీణులు, నిరక్షరాస్యులు, ఉన్నత వర్గాల మహిళలు కూడా హిస్టరెక్టమీ చేయించుకోవడానికి మొగ్గుచూపుతున్నారని ఆ నివేదిక పేర్కొంది. వాస్తవానికి దేశంలో జరుగుతున్న మొత్తం హిస్టరెక్టమీ శస్త్రచికిత్సల్లో రెండో వంతు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని, వీటి పెరుగుదల వెనుక ఆసుపత్రుల లాభాపేక్ష కూడా ఒక కారణమై ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details