Road Accident: గూడూరు హైవేపై రోడ్డు ప్రమాదం.. మృత్యుంజయుడిగా రెండేళ్ల బాలుడు.. - గూడూరు లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Road Accident: తిరుపతి జిల్లా గూడూరు గ్రామీణ ఆదిశంకర కళాశాల వద్ద ఉన్న జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఫ్లై ఓవర్పై పనులు చేసే కూలీలతో ఆగివున్న ఓ ట్రాక్టర్ను.. లారీ ఢీకొంది. దీంతో ట్రాక్టర్లో ఉన్న రెండేళ్ల బాలుడు, మరో వ్యక్తి బ్రిడ్జి కింద ఉన్న పంబలేరు వాగులో పడిపోయారు. బాబు నీళ్లలో పడిన విషయం గమనించిన వెంటనే అప్రమత్తమైన ఓ కార్మికుడు.. నీళ్లలోకి దిగి రక్షించాడు. దీంతో బాబు మృత్యుంజయుడిగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో సుమారు ఆరుగురు కూలీలు ఉన్నట్లు సమాచారం. ఈ రోడ్డు ప్రమాదంలో బాబుతోపాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం నూతనంగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జాతీయ రహదారి పనులకు కూలీలుగా వారు వచ్చారు. ఈ కూలీలు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వారు. గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను, బాలుడిని.. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా బాలుడికి మెరుగైన వైద్యం అందించటం కోసం అక్కడి నుంచి నెల్లూరు హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.