విద్యార్థులే సేవకులు!.. విసనకర్రతో గాలి విసిరించుకున్న మహిళా టీచర్లు..
🎬 Watch Now: Feature Video
Teachers Used Students Like Fan : విద్యార్థులతో గాలి విసిరించుకున్నారు ఇద్దరు మహిళ టీచర్లు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపుడ్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే స్కూల్‌కు చెందిన ఈ ఇద్దరు టీచర్లు.. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున విసనకర్ర సాయంతో చిన్నారులతో గాలిని విసిరించుకున్నారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన ఓ పేరెంట్.. అనంతరం సామాజిక మాద్యమాల్లో దాన్ని పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సింబావోలి ప్రాంతంలోని పిర్‌నగర్ గ్రామంలోని స్కూల్లో ఈ ఘటన జరిగింది.
ఈ వీడియోలో ఒక టీచర్ జెండాపై పువ్వులు ఉంచుతూ.. విసనకర్ర సాయంతో విద్యార్థితో గాలి విసిరించుకున్నారు. మరో ఉపాధ్యాయురాలు కుర్చీలో కూర్చుని ఇదే తరహా ఘటనకు పాల్పడినట్లు వీడియోలో కనిపిస్తోంది. వీరి వీడియో కాస్త జిల్లా విద్యాధికారి చెంతకు చేరింది. వెంటనే దీనిపై విచారణ జరిపిన జిల్లా విద్యాధికారి.. ఇద్దరూ మహిళా టీచర్లపై చర్యలు తీసుకున్నారు. వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.