'వారంతా కలిసి 1600 మంది నిర్మాతల రక్తం తాగుతున్నారు.. పదవులే ప్రధానం!'
🎬 Watch Now: Feature Video
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల నేపథ్యంలో నిర్మాత సి. కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. గిల్డ్ పేరుతో కొందరు 1600 మంది నిర్మాతల రక్తం తాగుతున్నారని ఆయన మండిపడ్డారు. జులై 30న జరిగే ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్న సి. కల్యాణ్.. తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
" నాలుగేళ్లుగా చిన్న సినిమాల నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. లక్ష రూపాయలు లేకపోతే సినిమా విడుదల ఆగిపోయిన సందర్భాలు నేను ఎదుర్కొన్నా. ఆరు నెలలు చిన్న సినిమాలు రాకుండా ఆపితే.. కృష్ణానగర్ ఆకలితో అలమటిస్తుంది. దాసరి నారయణరావు కూడా ఇదే చెప్పేవారు. కానీ కొందరు నిర్మాతలు ఛాంబర్ ఎన్నికల్లో పోటీచేయరు. వారు డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను బెదిరిస్తారు. గిల్డ్ పేరుతో 27 మంది కలిసి 1600 మంది రక్తం తాగుతున్నారు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఆస్కార్ సినిమా (ఆర్ఆర్ఆర్) నిర్మాత దానయ్యను, బాహుబలి సినిమాల నిర్మాత శోభు యార్లగడ్డను ఎందుకు ఎన్నికల్లో నిలబెట్టడం లేదు? ఎన్నికల్లో పోటీ విషయంపై దిల్‌రాజుతో కలిసి మాట్లాడాను. ఆయన పక్కనున్న వారికి పదవులు కావాలి. నేను మాత్రం నిర్మాతలందరికీ మేలు చేద్దామనే ఎన్నికల్లో పోటీలో ఉన్నా" అని సి. కల్యాణ్ అన్నారు.