ఇష్టమైన ట్రాక్టర్లోనే సిద్ధూ అంతిమయాత్ర.. వేల మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు - Sidhu Moose Wala shot dead
🎬 Watch Now: Feature Video
Sidhu Moose Wala funeral: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా అంత్యక్రియలు వేల మంది అభిమానుల మధ్య జరిగాయి. సిద్ధూ సొంత గ్రామమైన మాన్సా జిల్లాలోని మూసాలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన మాన్సా సివిల్ ఆస్పత్రి నుంచి సిద్ధూ మృతదేహాన్ని మంగళవారం ఉదయం పటిష్ఠ బందోబస్తు మధ్య మూసాకు తీసుకొచ్చారు. సిద్ధూకు ఇష్టమైన ట్రాక్టర్లోనే మృతదేహానికి అంతిమయాత్ర నిర్వహించారు. సిద్ధూ రూపొందించిన ఎన్నో మ్యూజిక్ వీడియోల్లో ఈ ట్రాక్టర్ కనిపించింది. తమ అభిమాన సింగర్‌ను చివరిసారి చూసుకునేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కొంతమంది అభిమానులు సిద్ధూ ఫొటో ఉన్న టీషర్టులను ధరించి దహన సంస్కారాలకు హాజరయ్యారు. వీరిని చూసేందుకు సిద్ధూ తండ్రి బల్కౌర్ సింగ్ తన తలపాగాను సైతం తొలగించారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరిందర్ సింగ్ రాజా వారింగ్.. అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో సిద్ధూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు న్యాయ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST