మోదీ పర్యటనలో భద్రత వైఫల్యం.. వలయాన్ని దాటి పూలమాల వేయబోయిన యువకుడు
🎬 Watch Now: Feature Video
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కర్ణాటక పర్యటనలో భద్రత వైఫల్యం జరిగింది. హుబ్బళ్లిలో రోడ్‌షో సందర్భంగా ఓ యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకుని.. ఒక్కసారిగా ప్రధాని మోదీకి అత్యంత సమీపానికి దూసుకురావడం కలకలం రేపింది. గురువారం సాయంత్రం జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు హుబ్బళ్లికి చేరుకున్న ప్రధాని.. స్థానిక విమానాశ్రయం నుంచి వేడుక జరిగే రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్ వరకు రోడ్‌షో నిర్వహించారు. ఈ క్రమంలోనే.. ఓ వ్యక్తి బారికేడ్ దాటి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాడు. అలాగే ప్రధాని మోదీ వాహనం వైపు దూసుకెళ్లాడు. ప్రధానికి పూలమాల వేసేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చివరి క్షణంలో అతన్ని అడ్డుకుంది. స్థానిక పోలీసులు వెంటనే అతన్ని దూరం తీసుకెళ్లారు. అనంతరం ప్రధాని యథావిధిగా రోడ్డు షో కొనసాగించారు. అయితే, ఈ ఘటనపై హుబ్బళ్లి ధార్వాడ్ క్రైమ్ డిసిపి గోపాల్ బయాకోడ్ స్పందించారు. "ప్రధానమంత్రి భద్రతలో ఎలాంటి వైఫల్యం జరగలేదు. రోడ్‌షోలో ప్రధాని మోదీకి పూలమాల వేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి గురించి మరింత సమాచారం సేకరిస్తున్నాము" అని తెలిపారు.