Padma Vibhushan Nageshwar Reddy : తెలుగు ప్రజల ఖ్యాతి, తెలుగు వైద్యుల గొప్పతనాన్ని మరోసారి డాక్టర్ నాగేశ్వర రెడ్డి దేశానికి తెలిసేలా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించిన నాగేశ్వర్‌రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్, మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎండీ, చంఢీగఢ్‌లో PGIMER డీఎం పూర్తి చేశారు. నిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులుగా సేవలందించిన డాక్టర్ నాగేశ్వరరెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. అనంతరం హైదరాబాద్‌లో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిని స్థాపించారు. ప్రస్తుతం 40 రకాల వైద్య ప్రత్యేకతలతో ఏఐజీ రోగులకు సేవలందిస్తోంది. 4 దశాబ్దాలకు పైగా వైద్య రంగంలో ఉంటున్న ఆయన, వైద్య ఆవిష్కరణలు, విద్య, పరిశోధన, రోగుల సేవలకు తన జీవితాన్ని అంకితం చేశారు.
జీఐ (GI) ఎండోస్కోపీలో ఆయన నైపుణ్యం కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీని పరిచయం చేసిన తొలి వైద్యుడు నాగేశ్వరరెడ్డినే. ఎండోస్కోపీ పిత్తవాహిక చికిత్స కోసం ఉపయోగించేందుకు నాగిస్టంట్ అభివృద్ధి చేశారు. ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్‌కు తొలి భారతీయ అధ్యక్షుడిగా పని చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఆరోగ్య సేవలు అందించేందుకు ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ కాన్పూర్, ఐఐఐటీ హైదరాబాద్ ఇలా ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలిసి పలు ప్రాజెక్టులపై పని చేశారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కొవిడ్ మహమ్మారితో వణికిపోతున్న దశలో డాక్టర్ నాగేశ్వర రెడ్డి, ఆయన బృందం వైరస్‌పై పోరాటంలో కీలకంగా వ్యవహరించింది. కొవిడ్-19 రోగుల్లో జీర్ణాశయాంతర సమస్యలపై చికిత్సలకు ప్రొటోకాల్ అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించారు. రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గైడ్‌లైన్స్ బుక్ రిలీజ్ చేశారు. ఆ పుస్తకం దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులు, వైద్యులకు కొవిడ్ చికిత్సల్లో మార్గదర్శిగా మారింది. పెద్దలకు ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్లు, చికిత్సలు అందించారు.
అవార్డులు సొంతం : ఆయన అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. 1995 లో బీసీరాయ్ అవార్డు, 2002లో పద్మశ్రీ, 2009లో మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డు, 2013లో మాస్టర్ ఆఫ్ ది వరల్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆర్గనైజేషన్ అవార్డును నాగేశ్వరరెడ్డి అందుకున్నారు. 2016లో పద్మభూషణ్, 2021లో జీర్ణాశయాంతర ఎండోస్కోపీ రంగంలో అత్యున్నత గౌరవమైన రుడాల్ఫ్ వి.షిండ్లర్ అవార్డు నాగేశ్వర్‌రావును వరించింది. తాజాగా ఆ జాబితాలో పద్మవిభూషణ్ చేరింది.
పద్మ విభూషణ్ అందుకోవడం చాలా గౌరవం : పద్మవిభూషణ్ అవార్డును అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నానని డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఏఐజీ వైద్య బృందం మొత్తానికి, తమపై నమ్మకం ఉంచే రోగులకు ఆ ఘనత దక్కుతుందన్నారు. ఇది కేవలం వ్యక్తిగత మైలురాయి కాదని వైద్య స్ఫూర్తికి, ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణలో మన దేశ గొప్పతనాన్ని చాటి చెబుతుందని పేర్కొన్నారు. తెలుగుబిడ్డ, భారతీయుడిగా ప్రజాఆరోగ్యం, శ్రేయస్సుకు తోడ్పాటు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని పేర్కొన్నారు. నాగేశ్వరరెడ్డి భార్య క్యారల్ యాన్‌రెడ్డి డెర్మటాలజిస్టుగా సేవలు అందిస్తున్నారు. కుమార్తె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా అమెరికాలో ఉంటున్నారు.
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణకు పద్మశ్రీ
దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్- నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్