నదిలో చిక్కుకున్న బస్సు.. 50 మంది ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్.. చివరకు.. - కోటావాలి నదిలో చిక్కుకున్న బస్సు
🎬 Watch Now: Feature Video
50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కోటావాలి నదిలో చిక్కుకుపోయింది. భారీ వర్షాలకు ఒక్కసారిగా నది ప్రవాహం అధికం కావడం వల్ల నది దాటుతున్న బస్సు మధ్యలోనే ఆగిపోయింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించారు.
ఇదీ జరిగింది
నజిబాబాద్ డిపోకు చెందిన బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో బిజ్నౌర్ నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు బయలుదేరింది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో రాష్ట్రాల సరిహద్దులోకి చేరేసరికి కోటావాలి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే నది దాటుతుండగా వరద ప్రవాహం ఎక్కువై బస్సు మధ్యలోనే చిక్కుకుపోయింది. బస్సు ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడడం వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న మండావలి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నది ప్రవాహం మరింత అధికం కావడం వల్ల బిజ్నౌర్తో పాటు హరిద్వార్‌కు చెందిన రెస్క్యూ బృందాలతో ప్రయాణికుల్ని ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చారు. చివరకు జేసీబీని తెప్పించి బస్సులో చిక్కుకుని ఉన్న ఆరుగురు ప్రయాణికులను కాపాడారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని ఎస్పీ ప్రవీణ్ రంజన్ సింగ్ తెలిపారు.