'త్వరగా పెళ్లి చేసుకో.. ఎక్కువ టైమ్ లేదు!'.. లాలూ సూచన.. ఓకే చెప్పిన రాహుల్! - లాలూ ప్రసాద్ యాదవ్
🎬 Watch Now: Feature Video
Rahul Gandhi Lalu Yadav : దేశ రాజకీయాల్ని కీలక మలుపు తిప్పగలదని భావిస్తున్న విపక్ష పార్టీల సమావేశంలో నవ్వులు పూయించారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. పట్నాలోని నీతీశ్ కుమార్ నివాసంలో భేటీ అనంతరం విపక్ష నేతలు కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్లో తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు. బీజేపీపై పోరులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(53) ఎంతో బాగా పనిచేస్తున్నారని ప్రశంసించిన లాలూ.. అనూహ్యంగా పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు.
"రాహుల్ గాంధీ వచ్చారు. ఈ మధ్య కాలంలో ఆయన చాలా బాగా పనిచేశారు. భారత దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అదానీ వ్యవహారంలో లోక్‌సభలో పోరాడారు. మీరు(రాహుల్ గాంధీ) పెళ్లి చేసుకుని తీరాలి. ఇంకా ఎక్కువ సమయం లేదు. పెళ్లి చేసుకోండి.. మమ్మల్ని బరాత్‌కు తీసుకెళ్లండి. వివాహం విషయంలో మాట వినడం లేదని మీ తల్లి(సోనియా గాంధీ) ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి" అని కాంగ్రెస్ అగ్రనేతకు సూచించారు లాలూ ప్రసాద్ యాదవ్.
ఆర్జేడీ అధినేత పెళ్లి గురించి మాట్లాడుతుండగా.. చుట్టూ ఉన్న నేతల నవ్వులతో ఆ ప్రాంగణమంతా సందడిగా మారింది. లాలూ సూచనపై నవ్వుతూ స్పందించిన రాహుల్ గాంధీ.. "మీరు అడిగారు కాబట్టి అయిపోయినట్టే" అని జవాబు ఇచ్చారు.