120 గంటలపాటు తబలా వాయించి ప్రపంచ రికార్డు.. గిన్నిస్ బుక్‌లో చోటు కోసం..
🎬 Watch Now: Feature Video
120 గంటలపాటు నిర్విరామంగా తబలా వాయించి అరుదైన ఘనతను సాధించాడు పంజాబ్‌లోని ఓ యువకుడు. బటాలా నగరానికి చెందిన అమృత్‌ప్రీత్ సింగ్ ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు. ఇంతకుముందు ఈ ప్రపంచ రికార్డు 110 గంటలుగా ఉండేది. వరుసగా ఐదు రోజులు తబలా వాయించడం ద్వారా ఈ రికార్డును నెలకొల్పాడు. గతేడాది డిసెంబర్ 31న ఉదయం 11 గంటలకు తమ మత గురువు గురు సాహిబ్ జీ కోసం ప్రార్థిస్తూ తబలా వాయించటం ప్రారంభించాడు అమృత్ ప్రీత్ సింగ్. ఈ నెల 5న ఉదయం 11 గంటలకు దీన్ని ముగించాడు. ప్రస్తుతం అమృత్ ప్రీత్ సింగ్ గురునానక్ కళాశాలలో ఫార్మసీలో డిగ్రీ చేస్తున్నాడు. దీంతో పాటు అతడు గుర్బానీ (సిక్కుల పవిత్ర వచనాలు)లోనూ ప్రావీణ్యం సంపాదించాడు. తాను 9 సంవత్సరాల వయస్సు నుంచే తబలా వాయించడం నేర్చుకున్నానని అమృత్‌ప్రీత్ సింగ్ చెప్పాడు. ప్రస్తుతం లిమ్కా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతేగాక 17 సంవత్సరాల వయస్సు నుంచే అమృత్‌ప్రీత్ సింగ్ అనేక గురుద్వారాలలో తబలా వాయిస్తూ సేవ చేస్తున్నాడు.