How to Avoid Stress Tips For Students : ఇతరులతో పోల్చుకుని చదువులో వెనకబడుతున్నాననే బాధతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ విద్యార్థి కళాశాలకు వెళ్లడం మానేశాడు. ఒత్తిడితో ఇటీవలి కాలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా చాలా మంది విద్యార్థులు ఆందోళనను గురవుతున్నారు. వార్షిక పరీక్షల్లో ఆశించిన మార్కులు రాలేదని, ఫెయిల్ అయ్యామని నిరుడు పది, ఇంటర్మీడియట్ పలువురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు.
పరీక్షల అంతిమ ఫలితం కేవలం అత్యుత్తమ మార్కులే కారాదన్నది విద్యారంగ నిపుణుల మాట. మరికొద్ది రోజుల్లో జరగనున్న పది, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రశ్నలు ఎలా వస్తాయో? ఫలితాలు ఎలా ఉంటాయో? అని ఇప్పట్నుంచే ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని సూచనలు చేస్తున్నారు. దీన్ని అధిగమించేందుకు కొందరు అనుభవజ్ఞులైన రెసిడెన్షియల్ విద్యాలయాల ప్రిన్సిపాళ్లు అందించిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
విద్యార్థులందరూ సమర్థులే : ఎగ్జామ్ ప్రస్తావన తేగానే విద్యార్థుల్లో ఒత్తిడి చూస్తుంటాం. వార్షిక ఫలితాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయనేది కొంత వాస్తవమే. కానీ, అవే జీవితం కాదు. ప్రతి ఒక్క విద్యార్థి తమపై తాము నమ్మకం ఉంచుకోవాలి. నెలలుగా, సంవత్సరాలుగా అభ్యాసం సాగిస్తున్నారు. అర్ధరాత్రుళ్లూ పాఠ్యాంశాలు ఔపోసన పట్టిన సందర్భాలు అనేకం. ఇలా పట్టుసాధించిన అంశాలు, భావనలను మరోసారి గుర్తు చేసుకోవాలి. తమకు ఉన్న జ్ఞానంతో రాణిస్తామని నమ్మాలి. విద్యార్థులందరూ సమర్థులే. ఈ ఆత్మవిశ్వాసమే ముందుకుసాగేలా చేస్తుంది. ఆందోళన కలిగించే అంశాలపై స్వీయ నియంత్రణ అలవర్చుకోవాలి. ఇందుకోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు సాయపడాలి. ముఖ్యంగా లోటుపాట్లను హుందాగా స్వీకరించేలా ప్రోత్సహించాలి. ఇలా చేస్తే పరీక్షల కల్లా విద్యార్థులు తెలివిగా ప్రవర్తిస్తారు.
ఎవరిశైలి వారిదే : ఎగ్జామ్స్ వల్ల కలిగే ఒత్తిడిని నిర్మాణాత్మకంగా ఎదుర్కోవాలి. చిన్న చిన్న విరామాలు, చురుకుదనం, తగినంత నిద్ర, ఆనందాన్ని ఇచ్చే అలవాట్లు, సమతుల ఆహారం ఇందుకు దోహదపడతాయి. ప్రతిదీ సరైన దృష్టితో చూడటమనేది సన్నద్ధత ఉత్సాహంగా, మెరుగ్గా సాగేలా చూస్తుంది. విద్యను ఎవరి శైలిలో వారు నేర్చుకుంటారు. జ్ఞాన ప్రదర్శన అనేది విభిన్న రీతిలో ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క విద్యార్థి ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రత్యేక బలాలు, లక్ష్యాలపైనే మరింత దృష్టి పెట్టాలి.
పరీక్షల టైంలో ఈ ఒక్క వస్తువును పక్కన పెట్టి చూడండి - విజయం మీదే!