ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం.. పైలట్, చిన్నారికి తీవ్ర గాయాలు.. లైవ్ వీడియో.. - ఝార్ఖండ్‌లో విమాన ప్రమాదం ఇద్దరికి గాయాలు
🎬 Watch Now: Feature Video
ఝార్ఖండ్‌లో విమాన ప్రమాద ఘటన తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలోని ధన్‌బాద్ నగరంలో గురువారం ఓ చిన్న సైజు విమానం అదుపు తప్పి నివాస ప్రాంతాలపై పడిపోయింది. ఈ ఘటనలో పైలట్ సహా ఓ చిన్నారి తీవ్ర గాయాల పాలయ్యారు. కాగా, ఈ ఫ్లైట్ గురువారం మధ్యాహ్నం నగరంలోని బర్వాడ్డ ఏరోడోమ్ నుంచి బయలుదేరింది. ఆకాశంలో కొంత సమయం విహరించాక విమానం ఎయిర్‌పోర్టుకు ఒకట్రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. విమాన కూలిన శబ్దం విన్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థుల సహాయంతో ఘటనలో గాయపడిన పైలట్ సహా చిన్నారిని దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో ప్రమాదం జరిగిన స్థలంలో ప్రజలు భారీగా గుమిగుడడం వల్ల వారిని నియంత్రించలేక పోలీసులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొన్నేళ్ల క్రితం ధన్‌బాద్ నగరంలో ప్రారంభించిన ఈ గ్లైడర్ సేవలను ఇటీవల నిలిపివేశారు. కాగా, ఇద్దరు కూర్చునే సామర్థ్యం గల ఈ సర్వీస్‌ను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. అయితే నగరాన్ని ఏరియల్ వ్యూలో వీక్షించేందుకు పర్యటకుల కోసం ఈ విమాన సర్వీసును ఏర్పాటు చేశారు అధికారులు. ఇదిలా ఉంటే.. దెబ్బతిన్న విమానం రెక్కలను తమ చేతుల్లో పట్టుకొని ఫొటోలు దిగారు కొందరు స్థానికులు.