'ఒకేసారి రెండు రైళ్లకు సిగ్నల్.. అందుకే ప్రమాదం'.. చెల్లాచెదురుగా మృతదేహాలు - కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం
🎬 Watch Now: Feature Video
Odisha Train Accident : పెద్ద శబ్దం... భారీగా కుదుపులు... చుట్టూ చీకటి... ఏం జరిగిందో తెలియని స్థితి. ప్రమాదం జరిగిన రైళ్లలో ప్రయాణికులకు ఎదురైన పరిస్థితి ఇది. ఎటు చూసినా ధ్వంసమైన బోగీలు. ఆర్తనాదాలు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు కనిపించాయి. అక్కడ అంతా భయానక వాతావరణం నెలకొంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్, జనరల్ బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా బయట పడి ఉన్నాయి. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లో అంబులెన్సులు వచ్చినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంతో రైళ్లలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒకేసారి రెండు రైళ్లకు సిగ్నల్ ఇచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బోగీ నుంచి బయటకు దిగినప్పుడు రైల్వే లైన్ విద్యుత్ తీగలు కిందకి తగిలేలా వేలాడుతున్నాయని చెప్పారు. అదృష్టం కొద్దీ వాటిలో విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల మరింత ప్రాణ నష్టం తప్పిందని అంటున్నారు.
ప్రమాదం జరిగింది ఇలా..
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది మృతి చెందారు. 900 మందికి పైగా గాయపడ్డారు. బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు ఏడు గంటల ప్రాంతంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. వాటిని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పదిహేను బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం బోల్తాపడ్డ కోరమండల్ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగింది. ఘటన జరిగిన గురైన సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది.