Margadarsi Case Hearing in AP High Court: మార్గదర్శిపై తప్పుడు ఆరోపణలతో సీఐడీ కేసు.. హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా.. - మార్గదర్శిపై తప్పుడు ఆరోపణలతో సీఐడీ కేసు
🎬 Watch Now: Feature Video
Published : Oct 18, 2023, 6:49 AM IST
Margadarsi Case Hearing in AP High Court: తన తండ్రి జగన్నాథరెడ్డి ద్వారా తనకు దఖలు పడిన 288 షేర్లను ఫోర్జరీ సంతకాలతో మార్గదర్శి ఎండీకి బదలాయించారనే ఆరోపణలతో.. గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదుతో సీఐడీ నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.
రామోజీరావు, శైలజా కిరణ్‌లపై ఈనెల 18 వరకు కఠిన చర్యలు తీసుకోబోమని సీఐడీ హామీ ఇవ్వడంతో విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, నాగముత్తు, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిటిషనర్లు, వారి సంస్థలను తరుచూ ఇబ్బంది పెడుతోందన్నారు. కక్షసాధించేందుకు గతంలో నమోదు చేసిన తప్పుడు కేసుల నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులిచ్చాయన్నారు. ప్రభుత్వ ప్రోద్భలంతోనే పిటిషనర్లపై తాజాగా తప్పుడు కేసు నమోదు చేశారన్నారు.
సీఐడీ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. ప్రస్తుత వ్యాజ్యాలు తొలిసారే విచారణకు వచ్చాయన్నారు. వివరాలు సమర్పించేందుకు కేసును గురువారానికి వాయిదా వేయాలన్నారు. అప్పటి వరకు పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోబోమని హామీ ఇస్తారా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని సీఐడీ తరపు న్యాయవాది కోరగా.. మీరు కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏంటని న్యాయమూర్తి అన్నారు. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని..అప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వడంతో విచారణను బుధవారానికి వాయిదా వేశారు.