Special Trains For Chardham Yatra Tour : భారత్ గౌరవ్ రైళ్లకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దీనికోసం భారతీయ రైల్వే వివిధ ప్రాంతాలకు ప్రత్యేక భారత్ గౌరవ్ రైళ్లను నడిపిస్తోంది. మొట్టమొదటిసారిగా చార్ధామ్ యాత్రకు భారతీయ రైల్వే శ్రీకారం చుట్టింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో వచ్చే మే నెలలో చార్ధామ్ యాత్రను తలపెట్టినట్లు నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. జీఎంవీఎన్(గర్ వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్), భారతీయ రైల్వే, టూర్స్ టైమ్స్ సంయుక్తంగా చార్ధామ్ యాత్రను ప్రవేశపెట్టాయి.
16 రోజుల పాటు చార్ధామ్ యాత్ర : మే 8వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు 16 రోజులపాటు చార్ధామ్ యాత్ర కొనసాగనుంది. గర్ వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మొదటిసారిగా చార్ధామ్ యాత్రను ప్రారంభిస్తున్నామని టూర్స్ టైమ్స్ తెలంగాణ, ఏపీ రీజినల్ ఇంఛార్జ్ రమేష్ అయ్యంగార్ తెలిపారు. హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో నిర్వహించిన మీడియా సమావేశంలో చార్ధామ్ యాత్ర విశేషాలను ఆయన వెల్లడించారు.
3 విభాగాలలో టికెట్ల ధరలు : యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లను కవర్ చేస్తూ 16 రోజుల చార్‌ధామ్‌ను తలపెట్టినట్లు ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ యాత్రకు ఫస్ట్ ఏసీకి ధర ఒక్కొక్కరికి రూ.82 వేల 5 వందలు, సెకండ్ ఏసీకి ఒక్కొక్కరికి రూ.75 వేల 5 వందలు, థర్డ్ ఏసీకి ఒక్కొక్కరికి రూ.70వేల 5 వందలను ప్యాకేజీలుగా నిర్ణయించినట్లు తెలిపారు.
భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా యాత్ర : ప్రతి కోచ్‌లో సీసీ కెమెరాలు, టూర్ మేనేజర్, హౌస్ కీపింగ్‌కు సంబంధించిన వ్యక్తులు, సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రయాణికులు సౌకర్యవంతంగా, భద్రతతో యాత్రను పూర్తి చేసే విధంగా చార్ధామ్ యాత్రను డిజైన్ చేశామన్నారు. ప్రయాణికుల భద్రతనే దృష్టిలో ఉంచుకుని ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
సైకిల్‌పై 8ఏళ్ల కూతురితో చార్ధామ్ యాత్ర- ఆ వ్యక్తి కోసమే! - Chardham Yatra On Bicycle