EX CM KCR Birthday Celebrations in Marriage Event in Siddipet District : వివాహ విందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అపురూప వేడుకను కానుకగా ఇచ్చారు పెళ్లివారు. సిద్దిపేట జిల్లా పాములపర్తిలో ఓ వివాహ విందు వేడుక జరిగింది. సతీమణి శోభతో కలిసి కేసీఆర్ అతిథిగా వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. కేసీఆర్ పుట్టినరోజు కావడంతో పరిణయ వేదిక వద్దే అప్పటికప్పుడు వేడుకకు ఏర్పాట్లు చేశారు. అతిథుల శుభాకాంక్షల మధ్య కేసీఆర్ దంపతులు ఒకరికొకరు ఉంగరాలు, పూలదండలు మార్చుకున్నారు.
కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం : హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్‌ను కోశారు. మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా రాబోయే మూడున్నరేళ్లు పని చేద్దామని బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. అదే ఆయనకు మనమిచ్చే జన్మదిన కానుకని పేర్కొన్నారు.
వివిధ దేవాలయాల్లో పూజలు : కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని హైదరాబాద్ నందినగర్‌లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాంపల్లి దర్గాలో మాజీ హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ ప్రార్థనలు చేశారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని చిత్తారమ్మ ఆలయంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు అమ్మవారిని ప్రార్థించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లోనూ గులాబీ శ్రేణులు పూజలు నిర్వహించారు. లండన్‌లో బీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
కేసీఆర్ భారీ కటౌట్‌కు పాలతో అభిషేకం : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భాగ్యతండాలో కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వరంగల్ పోచమ్మ మైదాన్ కూడలిలో 40 అడుగుల కేసీఆర్ భారీ కటౌట్‌కు పాలతో అభిషేకం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కస్నా తండాలో మిర్చి కల్లంలో కేసీఆర్ పుట్టిన రోజును రైతులు వినూత్నంగా జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రైతులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.