Does Pulses Cause Gas Acidity: మాంసాహారం ఇష్టపడని వారికి, శాకాహారం తీసుకునే వారికి పప్పులు మంచి ఆప్షన్. వీటిలో మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, పప్పు ధాన్యాలతో గ్యాస్ బాధలు పెరుగుతాయని, పొట్టంతా ఉబ్బరం, అజీర్తి చేస్తుందని కొంతమంది బలంగా నమ్ముతుంటారు. ఈ నమ్మకంతోనే పప్పు ధాన్యాలకు దూరంగా ఉంటుంటారు. కానీ ఇందులో కొంతే వాస్తమని నిపుణులు అంటున్నారు. వీటిని వండుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చక్కని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

"పప్పు ధాన్యాల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా మనం సహజంగానే అన్నం తినేటప్పుడు పప్పు, గింజ ధాన్యాలు కలిపి తీసుకుంటాం. ఈ రెండింటిని కలిపి తింటే శరీరానికి కావాల్సిన 22 రకాల ఆమైనో యాసిడ్స్ అందుతాయి. అన్ని పప్పుల్లో 100 గ్రాములకు 22 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. అన్నింటి కన్నా ఎక్కువగా సోయా బీన్లో 42 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. పప్పుకు బదులుగా సోయాబీన్ వాడినా మంచిది. చీము పడుతుందని, అరగదని, పిల్లల్లో మలబద్ధకం సమస్యలు వస్తాయని అనుకుంటుంటారు. అయితే ఇవన్నీ అపొహా మాత్రమే."
--డాక్టర్ అంజలీ దేవి, పోషకాహార నిపుణులు
నిజానికి అన్ని పప్పు ధాన్యాలతో అజీర్తి, గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఉండవని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు అందించే పప్పు ధాన్యాలపై అపొహా వీడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలె అమెరికాలో పప్పు తినేవారిపై జరిగిన అధ్యయనంలో కేవలం 3-11శాతం మందిలో మాత్రమే అజీర్తి, గ్యాస్ సమస్యలు కనిపించాయని తేలింది. మిగతావారిలో ఎలాంటి సమస్యలు కనిపించలేదని.. పైగా చెడు కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గిపోయాయని పేర్కొంది. ఇంకా ముఖ్యంగా గుండె జబ్బులు కూడా బాగా తగ్గుముఖం పట్టినట్లు బయటపడింది. పప్పు ధాన్యాలు తీసుకునేవారిలో తొలిరోజుల్లో గ్యాస్ సమస్య కనిపించినా.. తర్వాత అవే తగ్గిపోయయాని పరిశోధకులు తెలిపారు. ప్రొటీన్ల, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభించే పప్పు ధాన్యాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే, పప్పు ధాన్యాలను వండుకునే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అజీర్తి, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పప్పు ధాన్యాలు వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. పప్పు ధాన్యాలను వండే ముందు 12- 24 గంటల వరకు నానబెట్టాలని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాటిలో అజీర్తికి కారణమయ్యే కారకాలు తొలగిపోతాయని అంటున్నారు. ఇంకా వండిన తర్వాత కూడా పప్పు ధాన్యాలు సులభంగా జీర్ణం అవుతాయని వివరిస్తున్నారు. వీటిని వండేటప్పుడు తక్కువ వేడిలో ఎక్కువ సేపు ఉడికించడం మంచిదని చెబుతున్నారు. ఇప్పటికే అరుగదల సమస్యలు ఉన్నవారు.. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అతిగా తీసుకోకూడదని వెల్లడిస్తున్నారు.

ముఖ్యంగా పప్పు ధాన్యాలను నానబెట్టిన, ఉడకబెట్టిన నీటిలో పోషకాలు ఉంటాయని.. కాబట్టి వాటిని కూరలోకి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు పొట్టుతోనే పప్పులను తినాలని.. ఇలా చేస్తే మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుందని చెబుతున్నారు. మొలకెత్తినవి తినడం వల్ల బీ కాంప్లెక్స్ విటమిన్లు అందుతాయని పేర్కొన్నారు. అలానీ మరీ ఎక్కువగా మొలకెత్తించకూడదని.. 24గంటల లోపే తినాలని అంటున్నారు.


NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? ముందే గుర్తిస్తే ఆ సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చట!
'పిల్లలకు తరచూ జ్వరం రావడం క్యాన్సర్ లక్షణమే'- మీ పిల్లల్లో ఇవి ఉన్నాయో చెక్ చేయండి!