Car Driving Tips In India : దేశంలో చాలా రోడ్డు ప్రమాదాలు భారీ ట్రాఫిక్‌లోనే కాకుండా ఓపెన్ హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలలో కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓపెన్ హైవే, ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణించినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగకుండా కారు డ్రైవర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీ లేన్‌లో కారు నడపండి
హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలో వాహనాలు అధిక వేగంతో వెళ్తాయి. దీంతో వాహనాలను సడెన్‌గా కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు మీరు ఎల్లప్పుడూ మీ లేన్‌లో ప్రయాణించండి. ఇలా చేయడం వల్ల మీరు ఈజీగా మీ ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయొచ్చు. అలాగే ఇతర వాహనాలను ఢీకొట్టే ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
స్పీడ్ లిమిట్ పాటించండి
హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలలో స్పీడ్ లిమిట్‌ను పాటించండి. దీంతో మీ ప్రయాణం మరింత సాఫీగా సాగిపోతుంది. అలాగే ఎటువంటి ప్రమాదం లేకుండా మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. స్పీడ్ లిమిడ్ కంటే తక్కువ వేగంతో మీ కారును డ్రైవ్ చేయండి. అలాగే స్పీడ్ లిమిట్ రూల్స్‌ను పాటించడం వల్ల ట్రాఫిక్ జరిమానాలు పడవు.
దూరమూ ముఖ్యమే
హైవేలపై డ్రైవింగ్ చేసేటప్పుడు మీ కారును ఇతర వాహనాలకు కాస్త దూరంగా నడపండి. అప్పుడు రోడ్డు యాక్సిడెంట్లు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అధిక వేగంతో వాహనాన్ని నడుపుతున్నప్పుడు ముందున్న వాహనం కంటే కనీసం 4-6 అడుగుల దూరం పాటించండి.
లోబీమ్ హెడ్ లైట్లు
రాత్రి సమయాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనాలకు హెడ్ లైట్లు అతి ముఖ్యం. వాటిని ఎలా ఉపయోగించాలో తెలియడం కూడా అంతకంటే ప్రధానం. మీరు రాత్రిపూట హైవేపై డ్రైవింగ్ చేస్తుంటే లోబీమ్ హెడ్ లైట్లను ఉపయోగించడం మంచిది. రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు హైబీమ్ హెడ్ లైట్ల వాడకం అత్యంత ప్రమాదకరం. ఆ లైట్లు ఎదురుగా వస్తున్న వాహనదారు కంటిపై నేరుగా పడటం వల్ల ముందున్న రోడ్డు కనిపించక ప్రమాదాలకు కారణం కావచ్చు. అంతేకాకుండా, హైబీమ్ హెడ్ లైట్లను ఉపయోగించడం వల్ల ట్రాఫిక్ పోలీసులు ఫైన్ కూడా వేయవచ్చు.