చనిపోయిన కుమారుడి కోసం రూ.10 కోట్లతో మ్యూజియం.. నిలువెత్తు విగ్రహాలతో.. - కింగ్ రిచర్డ్ స్మారకం
🎬 Watch Now: Feature Video
బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన కొడుకుకు గుర్తుగా స్మారకాన్ని నిర్మించారు ఆయన తల్లి. కారు రైడర్‌గా ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్త కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్‌కు గుర్తుగా.. ఈ స్మారకం ఏర్పాటు చేయించారు. కర్ణాటక బెంగళూరు మహదేవపుర ప్రాంతంలో ఈ స్మారక మ్యూజియం ఉంది. 2015లో హాబీగా బైక్ రైడింగ్ ప్రారంభించిన ఆయన.. ఏకంగా 50కి పైగా దేశాలను ఆయన సందర్శించారు. 2021లో జరిగిన బెంగళూరు నుంచి కశ్మీర్‌కు బైక్‌పై వెళ్తుండగా.. మధ్యలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ జైసల్మీర్‌లోని ఫతేగఢ్‌కు చేరుకున్న సమయంలో ఓ ఒంటె ఆయన బైక్‌కు అడ్డంగా వచ్చింది. దాన్ని ఢీకొట్టగానే ఎగిరిపడ్డ ఆయన.. తలకు తీవ్ర గాయం కావడం వల్ల కన్నుమూశారు.
రిచర్డ్ మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆయన కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తన కుమారుడికి స్మారక మ్యూజియాన్ని నిర్మించాలని ఆయన తల్లి భావించింది. మహదేవపురలోని యరప్పనహళ్లి సమీపంలో ఈజిప్ట్ శైలిలో, థాయిలాండ్ 3డీ పిచర్ టెక్నాలజీతో ఈ స్మారకం నిర్మించారు. ఇందులో ఆయన రెండు విగ్రహాలను నెలకొల్పారు. రిచర్డ్ వివిధ దేశాల్లో సందర్శించినప్పటి ఫొటోలు, ఆయన సాధించిన ఘనతలకు సంబంధించిన వివరాలను ప్రదర్శనకు ఉంచారు. రిచర్డ్ వాడిన బైక్‌లు, వివిధ దేశాల కరెన్సీ, కాయిన్లు, అద్భుతమైన పెయింటింగ్‌లు స్మారకంలో ఉంచారు. ఆయన ఘనతలకు సంబంధించిన వీడియోల ప్రదర్శనకు ఓ హోమ్ థియేటర్ ఏర్పాటు చేశారు. వీటన్నింటికి రూ.10 కోట్ల వ్యయం అయింది.
వారంలో ఏడు రోజులు తెరిచే ఉండే ఈ మ్యూజియాన్ని చూసేందుకు ఎంతో మంది బైక్ రైడర్లు వస్తున్నారు. అక్కడికి వచ్చి రిలాక్స్ అవుతున్నారు. కొద్దిరోజుల్లోనే ఈ మ్యూజియం టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది. పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. మార్చి 7న కింగ్ రిచర్డ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమాల నుంచి పిల్లలను ఆహ్వానించి క్రీడా పోటీలు పెడుతున్నారు. గెలిచిన వారికి బహుమతులు అందిస్తున్నారు. అంతేకాకుండా రిచర్డ్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి.. పేదలకు సాయం చేస్తున్నారు.
'నా భర్త ఎన్నో స్మృతులను నా వద్ద వదిలి వెళ్లారు. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. సామాజిక సేవ చేసేవారు. ఆయన లేనప్పటికీ.. ఆ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని అనుకుంటున్నాం' అని రిచర్డ్ భార్య మోనిక పేర్కొన్నారు.