నదితీరాలకు పోటెత్తిన ప్రజలు.. రాష్ట్రవ్యాప్తంగా సామూహిక పిండ ప్రదానం - బలి తర్పణం పూజలు
🎬 Watch Now: Feature Video
Karkidaka Vavu Bali 2023 : కేరళలోని పలు ప్రాంతాల్లో 'సామూహిక పిండ ప్రదానం' కార్యక్రమం సోమవారం భారీ స్థాయిలో జరిగింది. 'కర్కిడక వావు బలి' అని పిలిచే ఈ వేడుకకు.. వేలాది మంది హాజరయ్యారు. దీంతో నది తీరప్రాంతాలన్ని కిక్కిరిసిపోయాయి. పూర్వీకులకు వారి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలిగేందుకు 'బలితార్పణం' పూజలు నిర్వహించారు. ఇలా చేస్తే వారి దేహం విడిచి వెళ్లిన వారి ఆత్మ మోక్షం పొందుతుందని వారి నమ్మకం. సంప్రదాయబద్దంగా ఈ వేడుక జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవాలయాల్లో 'బలితార్పణం' కార్యక్రమాలు జరిగాయి.
కులం, లింగం, వయ్సస్సు తేడా లేకుండా చాలా మంది హిందువులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం పూజలు నిర్వహించారు. ఈ పూజల కోసం నది తీర ప్రాంతాలకు, ఆలయాలకు రాని కుటుంబ సభ్యులు.. ఇంట్లోనే ఈ తంతును పూర్తి చేశారు. ఎర్నాకులంలోని అలువా శివాలయం, వాయండ్‌లోని తిరునెల్లి ఆలయం, తిరువనంతపురంలోని తిరువల్లం పరశురామ ఆలయం, వర్కల పాపనాశం బీచ్, తిరువనంతపురం శంఖుముఖం బీచ్ , ఉరుపుణ్యకావు, కోజికోడ్‌లోని వర్క్కల్ బీచ్ వంటి ప్రాంతాల్లో వావు బలి కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పిండ ప్రదానం చేసే సమయంలో పూజలు నిర్వహించేందుకు అర్చకులను కూడా నియమించింది. నది జలాల్లో పవిత్ర స్నానాలు చేసిన అనంతరం వావుబలి నిర్వహించారు భక్తులు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా కేరళలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.