Goda Devi Kalyanam : భోగి పండుగ రోజున దక్షిణాదిన వైష్ణవ ఆలయాల్లో శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా అసలు గోదా రంగనాయకుల కళ్యాణం ఎలా జరిగింది? భోగి రోజునే ఈ కళ్యాణం జరపడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎవరీ గోదా దేవి!
శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే ఆళ్వారుకు తులసి వనంలో పసి పాపగా దొరికిన గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమని ప్రశస్తి. చిన్న వయసు నుంచే శ్రీకృష్ణుని తన భర్తగా భావిస్తూ, అయన కోసం అల్లిన పూలమాలలను ముందుగా తాను ధరించేదట. ఇది చూసి కలవరపడిన విష్ణుచిత్తుడు గోదా దేవిని కోపిస్తే స్వయంగా శ్రీరంగనాయకుడే విష్ణు చిత్తునికి స్వప్నంలో కనిపించి తనకు ఆ మాలలే తనకు ఇష్టమని చెప్పాడంట.
గోదాదేవి వలచింది ఎవరిని?
యుక్తవయసు వచ్చిన గోదాదేవికి వివాహం చేయదలచి ఆమె తండ్రి విష్ణుచిత్తుడు ఆమెకు ఎవరంటే ఇష్టమని అడగగా, ఆ శ్రీకృష్ణుడే తన భర్త అని ఆమె తెలుపుతుంది. అప్పుడు విష్ణుచిత్తుడు వటపత్రశాయితో మొదలు పెట్టి, 108 దివ్యదేశాలలో విష్ణు స్వరూపాలు వర్ణించి అందులో ఎవరిని ఆమె భర్తగా కోరుకుంటుంది అని అడగగా, శ్రీరంగంలో రంగనాథుని వర్ణించే సమయంలో ఆమె శరీరం గగుర్పాటుకు గురై, సిగ్గుతో తలవంచుకోగా ఆమె వరించింది శ్రీరంగనాయకుని అని విష్ణుచిత్తుడు గ్రహిస్తాడు. కానీ ఆయన చూస్తే భగవంతుడు. ఈమె చూస్తే మానవకన్య ఈ వివాహం ఎలా జరుగుతుందా అన్న ఆందోళనతో నిద్రిస్తున్న విష్ణుచిత్తునికి కలలో శ్రీరంగనాయకుడు కనిపిస్తాడు.
కల్యాణానికి శ్రీరంగానికి ఆహ్వానించిన రంగనాధుడు
విష్ణుచిత్తునికి కలలో కనిపించిన రంగనాధుడు "విష్ణుచిత్తుడు గోదా దేవిని తీసుకొని మేళతాళాలతో శ్రీరంగం వస్తే సాక్షాత్తూ పాండ్యమహారాజు ఛత్రధ్వజ చామరాదులతో, రత్నాదులచే అలంకరించబడిన దంతపు పల్లకిలో స్వాగతిస్తాడని, అక్కడే తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని" చెబుతాడు.
రంగనాథునిలో ఐక్యమైన గోదాదేవి
విష్ణుచిత్తుడు కలలో రంగనాయకుడు చెప్పినట్లుగా గోదాదేవిని, విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. పెళ్లి కూతురిగా అంతరాలయంలో ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి వైష్ణవాలయంలో భోగి రోజు గోదాదేవికి ఆ రంగనాథునితో వైభవంగా కళ్యాణం జరుపుతారు.
కల్యాణ ప్రాప్తి
పెళ్లి కాలేదని బాధపడుతున్న వారు, వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న భక్తిశ్రద్ధలతో శ్రీ గోదా రంగనాథుల కల్యాణం చూస్తే అవివాహితులకు కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని, అలాగే భార్య భర్తల మధ్య అపార్ధాలు ఉంటే తొలగిపోయి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.ఈ భోగి పండుగ రోజు మనం కూడా శ్రీ గోదారంగనాథుల కల్యాణంలో పాల్గొందాం. సకల శుభాలను పొందుదాం. శ్రీ గోదా రంగనాయక స్వామియే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.