రిటైర్మెంట్ స్పెషల్.. 3700 కిలోల కిచిడీ తయార్.. బాబా గుడిలో 15వేల మందికి పంపిణీ! - 3700 కిలోల కిచిడీ తయారీ సాయిబాబా గుడి
🎬 Watch Now: Feature Video
వృత్తిరీత్యా ఆయన బీహెచ్ఈఎల్లో ఉద్యోగి. ఇటీవలే తన 37 సంవతర్సాల సర్వీస్ పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందారు. అయితే రిటైర్ అయిన సందర్భంగా.. స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయంలో అన్నదానం చేద్దామనుకున్నారు. అందుకుగాను 3,700 కిలోల వెజిటేబుల్ కిచిడీని తయారు చేయించారు. ఆలయ ప్రాంగణంలో 15 వేల మందికి పంపిణీ చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది.
భోపాల్లోని అవధిపురి ప్రాంతానికి చెందిన రమేశ్ కుమార్ మహజన్.. ఇటీవలే రిటైర్ అయ్యారు. ఆయన స్థానికంగా ఉన్న 'షిర్డీ సాయిబాబా మందిరం'లో ట్రస్ట్ మెంబర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 37 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందినందుకు.. 3700 కిలోల కిచిడీ తయారు చేసి పంపిణీ చేద్దామనుకున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే సాయిబాబాకు గురువారం ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తుంటారు భక్తులు. అందుకే ఏప్రిల్ 27వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
400 కిలోల కూరగాయలు.. 350 కిలోల బియ్యం..
గురువారం.. 25 మంది ఆరు గంటలపాటు కష్టపడి.. భారీ కడాయిలో 3700 కిలోల కిచిడీని తయారు చేశారు. అందుకు 400 కిలోల కూరగాయలు, 250 కిలోల బియ్యం, 60 కిలోల పప్పు దినుసులను వినియోగించారు. అనంతరం సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. శిర్డీనాథుడికి ప్రసాదంగా నివేదించి.. ఆ ప్రాంతంలోని 15 వేల మందికి ఈ కిచిడీని పంపిణీ చేశారు.
గిన్నిస్ రికార్డుకు దరఖాస్తు..
కిచిడీ తయారీ నుంచి పంపిణీ వరకు మొత్తం ప్రక్రియను వీడియో రూపంలో రికార్డు చేశామని రమేశ్ మహజన్ తెలిపారు. దీనిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బృందానికి పంపనున్నట్లు చెప్పారు. కచ్చితంగా గిన్నిస్ బుక్లో చోటు సంపాదిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2020 జనవరిలో హిమాచల్ ప్రదేశ్లో 1995 కిలోల కిచిడీ తయారుచేసినట్లు గిన్నిస్ రికార్డు ఉందని.. తాము దానిని బద్దలు కొట్టనున్నట్లు తెలిపారు. 3700 కిలోల కిచిడీ ప్రసాదం తయారీకి సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు వివరించారు.