BJP నేత కుమారుడి కారుపై బాంబుల దాడి.. వారిపైనే డౌట్! - అలహాబాద్ జిల్లాలో బాంబు దాడి
🎬 Watch Now: Feature Video
బీజేపీ మహిళా నేత కుమారుడి కారుపై కొందరు దుండగులు బాంబు దాడి చేశారు. కారు ఆగి ఉన్న సమయంలో రెండు బైక్‌లపై వచ్చిన ఆరుగురు దుండగులు.. రెండు సార్లు బాంబులు వేశారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. కారును మందుకు నడిపి త్రుటిలో అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ జిల్లాలో జరిగింది.
ఝాన్సీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గంగపర్ ప్రాంతానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా నేత విజయలక్ష్మి సింగ్ చందెల్ కుమారుడు గురువారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లాడు. మార్గమధ్యలో అతడి కారును కొందరు దుండగులు ఆపారు. రెండు బైక్‌లపై వచ్చిన వారు.. వెంట వెంటనే రెండు బాంబులతో దాడి చేశారు. అయితే ఈ దాడి వెనుక పోలీసు కానిస్టేబుల్ శివం బచ్చన్ యాదవ్ కుమారుడు శివం యాదవ్ ఉన్నాడని విజయలక్ష్మి ఆరోపించారు. నడిరోడ్డులో కారుపై బాంబులతో దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి జరగడానికి గల కారణాలేంటో కనుక్కోవాలని పోలీసులను కోరారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య మరవకముందే.. ఈ ఘటన జరగడం ఆ జిల్లాలో కలకలం రేపింది.