Kejriwal Complaint To EC : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న నియోజకవర్గ ఓటర్ల జాబితాను బీజేపీ తారుమారు చేసిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీకి అనుకూలంగా 13,000 ఓట్లను చేర్చి, మరో 5,500 ఓట్ల నమోదును రద్దు చేశారని, ఈ విధంగా ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు కాషాయ పార్టీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. అంతేకాదు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు అక్రమ నిధులను తన ఇంట్లో దాచుకొన్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఇంటిపై అధికారులు దాడి చేయాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
వలస జీవులను నకిలీ ఓటర్లని అంటారా!
ఆప్ అధ్యక్షుడికి ఓటమి భయం పట్టుకుందని, ఆయన న్యూ దిల్లీతోపాటు, మరో స్థానం నుంచి కూడా పోటీ చేయవచ్చని బీజేపీ చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ కొట్టిపడేశారు. "నేను న్యూదిల్లీ నుంచి మాత్రమే బరిలోకి దిగుతా. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్యే ముఖాముఖి పోటీ ఉంది. ఇది ఇండియా కూటమి వ్యవహారం కాదు" అని స్పష్టం చేశారు. 2013 నుంచి వరుసగా మూడుసార్లు న్యూదిల్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కేజ్రీవాల్‌పై పోటీగా బీజేపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎస్. వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. దీంతో ఈ స్థానంలో పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఓటర్ల జాబితా గురించి కేజ్రీవాల్ ఆరోపణలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా ఖండించారు. యూపీ, బిహార్‌ల నుంచి దిల్లీకి వలస వచ్చిన ప్రజలను నకిలీ ఓటర్లంటూ ఆప్ అధినేత అవమానిస్తున్నారని అన్నారు.
జాట్ల రిజర్వేషన్లపై మాటకు మాట
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దిల్లీలోని జాట్ సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని తుంగలో తొక్కిందని కేజ్రీవాల్ విమర్శించారు. జాట్లను సెంట్రల్ ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి గతంలో తాను లేఖ కూడా రాసినట్లు పేర్కొన్నారు. అయితే, గత 11 ఏళ్లుగా జాట్లను పట్టించుకోని కేజ్రీవాల్, ఇపుడు దిల్లీని కులం ప్రాతిపదికగా వేరు చేసే ప్రయత్నం ప్రారంభించారని మాజీ ఎంపీ, న్యూదిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ప్రతిదాడికి దిగారు.
ఇండియా కూటమి నేతల ద్వారా మాపై కేజ్రీవాల్ ఒత్తిడి: కాంగ్రెస్
దిల్లీ ఎన్నికల్లో ‘అధికార వ్యతిరేకత’ కారణంగా ఆందోళన చెందుతున్న కేజ్రీవాల్ ఇండియా కూటమి నేతల ద్వారా తమపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని నగర కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ తెలిపారు. ఆప్‌నకు మద్దతుగా కూటమి పార్టీలు ఏవీ ఇప్పటి దాకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదని, పొత్తుకు తాము కూడా సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు.